అంబటికి ఘన స్వాగతం
సెంట్రల్ జైలు వద్దకు భారీగా చేరిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం విడుదలయ్యారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో సాయంత్రం 5 గంటలకు జైలు అధికారులు విడుదల చేశారు. అంబటి విడుదలవుతున్నారనే సమాచారం తెలిసిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు జైలు వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా పూర్తిగా జనసంద్రంగా మారింది. లాలాచెరువు నుంచి కంబాలచెరువు వెళ్లే రహదారి పూర్తిగా అభిమానులతో నిండిపోయింది. ఆ రహదారి గుండా వెళ్లే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. అన్ని పత్రాలు పరిశీలించాక జైలు అధికారులు అంబటిని బయటకు పంపారు. ఆయన బయటకు వచ్చే సమయంలో అభిమానులు జై జగన్, జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు. జైలు బయట మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, తలారి వెంకట్రావు, వైఎస్సార్ సీపీ నాయకులు గూడూరి శ్రీనివాసరావుతో పాటు ఇతర నాయకులు స్వాగతం పలికారు. అంబటి తప్పు చేయలేదని, ఆయన జైలుకు వెళ్లిన నాటి నుంచి పూర్తి ధైర్యంగా ఉన్నారని జక్కంపూడి రాజా అన్నారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతిపక్షంపై కక్ష సాధించడానికే ప్రజలు అధికారమిచ్చారని చంద్రబాబు అనుకుంటున్నారన్నారు. తానేటి వనిత మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నేతలపై కక్ష సాఽధించడం తప్ప చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి కొత్తగా ఏపీలో లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, త్వరలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అనంతరం అంబటి అందరికీ అభివాదం చేసుకుంటూ కారు ఎక్కారు. అనంతరం అంబటి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనను వైఎస్సార్ సీపీ నాయకులు కలిసి మాట్లాడారు. గురువారం ఉదయం ఆయన గుంటూరు వెళ్లనున్నారు. దీంతో ఆయనకు భారీగా వీడ్కోలు చెప్పేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు.


