ప్రభుత్వ వైద్య విద్యే ముద్దు
చంద్రబాబు సర్కారు వచ్చాక అమలాపురం మండలం
కామనగరువులో ఆగిపోయిన
ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణం
● నినదిస్తున్న కోనసీమ విద్యార్థి లోకం
● చంద్రబాబు సర్కారు
‘ప్రైవేటు’ జపంపై ఆగ్రహం
● వైఎస్సార్ సీపీ చేపట్టిన సంతకాల
సేకరణ ఉద్యమానికి మద్దతు
● ప్రజాస్పందన చూసైనా నిర్ణయం
మార్చుకోవాలని డిమాండ్
సాక్షి, అమలాపురం: పేదలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ మెడికల్ విద్యను పీపీపీ పేరుతో ‘ప్రైవేటీకరణ’ చేయవద్దు అని కోనసీమ జిల్లాకు చెందిన విద్యార్థులు ఎలుగెత్తి నినదిస్తున్నారు. తక్షణం పీపీపీ విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్మించాలని, గత వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరుతున్నారు. కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా విద్యార్థులు గత ప్రభుత్వ మెడికల్ కాలేజీ విధానానికి మద్దతు పలుకుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ పీపీపీ విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ విధానాన్ని సమర్థిస్తున్నారు. ఇందుకు మద్దతుగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి గళాల గర్జనకు మద్దతుగా సంతకాల ఉద్యమానికి దన్నుగా నిలిచారు. తమ వంతుగా వారు కూడా సంతకాలు చేసి ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.
ఏడాదిన్నరగా నిలిచిన నిర్మాణ పనులు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు, తన అనుయాయులకు కట్టబెట్టేందుకు పీపీపీ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం తెరపైకి తెచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమలాపురం మండలం కామనగరువులో గత ప్రభుత్వం 60 ఎకరాల్లో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు రూ.500 కోట్లను కేటాయించింది. పరిపాలనా భవనం, తరగతి గదుల నిర్మాణం, స్టాఫ్ నివాస భవనాల నిర్మాణ పనులు మొదలై చాలా వరకు పూర్తయ్యాయి. ఈ సమయంలో చంద్రబాబు ప్రభుత్వ పీపీపీ విధానం వల్ల ఏడాదిన్నరగా పనులు నిలిచిపోయాయి. దీనిని కోనసీమ విద్యార్థి లోకం తీవ్రంగా తప్పుపడుతోంది. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి గళాల సంతకాల సేకరణకు మద్దతు ఇచ్చింది. జిల్లావ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో వందలాది మంది విద్యార్థులు సంతకాలు చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టారు. పీపీపీ విధానంపై వివిధ వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను గుర్తించి ప్రభుత్వం తక్షణం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు కోరుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి కోటి సంతకాల సేకరణ ప్రతులను గురువారం రాష్ట్ర గవర్నర్ అబ్బుల్ నజీర్‌కు అందజేసిన నేపథ్యంలో జిల్లాలో విద్యార్థులు మరోసారి తమ మనోగతాన్ని ‘సాక్షి’ వద్ద ఆవిష్కరించారు.
పునరాలోచన చేయాలి
పీపీపీ విధానంపై ప్రభుత్వం ఇప్పటికై నా పునరాలోచన చేయాలి. అన్ని వర్గాల వారు ప్రభుత్వమే మెడికల్ కాలేజీ నిర్మాణాలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను.
– కుంచే అభిరామ్,
డిగ్రీ ద్వితీయ సంవత్సరం, అమలాపురం
ప్రతి ఒక్కరూ ప్రైవేట్‌గా చదవలేరు
వైద్య విద్యను ప్రతి ఒక్కరూ ప్రైవేట్‌గా చదవలేరు. ప్రైవేటురంగంలో వైద్య విద్య ఖరీదైన వ్యవహారంగా మారింది. సామాన్యులు, పేద వర్గాల వారు చదవుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వమే వైద్య కళాశాలలను కొనసాగించాలి. పీపీపీ విధానం మంచిది కాదు.
– గుర్రం కృప, ఎంబీబీఎస్, లక్కవరం,
మలికిపురం మండలం
ప్రైవేట్ పెత్తనంతో అసలుకే నష్టం
ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నిర్మిస్తే తక్కువ ఖర్చుకు వైద్య విద్య అందుతుంది. పేదలకు ఉచిత వైద్య సదుపాయాలు పెరుగుతాయి. అదే ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తే వైద్య విద్య ఖరీదై సామాన్య విద్యార్థులకు అందకుండా పోతుంది. ఉచిత వైద్యం కూడా అందదు.
– బొంతు రాహుల్, డిగ్రీ ఫస్ట్ ఇయర్,
పాశర్లపూడిలంక, మామిడికుదురు మండలం
ప్రభుత్వ వైద్య విద్యే ముద్దు
ప్రభుత్వ వైద్య విద్యే ముద్దు
ప్రభుత్వ వైద్య విద్యే ముద్దు


