ఈ–పంట ఏ మాయో!
● గంటా సూర్యప్రకాశరావు కౌలురైతు. కొత్తపేటకు చినగూళ్లపాలెం, పెదగూళ్లపాలెంలలో వరి ఆయకట్టు ప్రాంతాల్లో 1.9 ఎకరాలలో సాగు చేశారు. దానిలో 1.25 ఎకరాలు ఈ–పంట నమోదైంది. 45 కింటాళ్ల ధాన్యాన్ని ఆర్‌ఎస్‌కేల ద్వారా వ్యాపారులకు విక్రయించారు. అయితే కేవలం 40 సెంట్ల విస్తీర్ణానికి సంబంధిం 10 క్వింటాళ్లకు 2,369 చొప్పున రూ.23,690 మాత్రమే ప్రభుత్వం జమ చేసింది. అంటే మిగిలిన 8.25 ఎకరాల విస్తీర్ణం ఈ–పంటలో నమోదు కాలేదు. మిగిలిన 35 క్వింటాళ్లకు ప్రైవేట్ వ్యాపారికి విక్రయించుకోవాల్సివచ్చింది. ఫలితంగా బస్తా ధర రూ.270 తగ్గిపోయింది. అలా 35 క్వింటాళ్లకు రూ.8,500 నష్టం వచ్చింది.
● పోతంశెట్టి సత్తిబాబు అనే కౌలురైతు కొత్తపేట చినగూళ్లపాలెం వరి ఆయకట్టులో 1.7 ఎకరాలు విస్తీర్ణంలో సాగు చేయగా 42.75 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. ఆ మొత్తం తూయగా 50 సెంట్ల విస్తీర్ణానికి సంబంధించి 17 క్వింటాళ్ల ధాన్యానికి రూ.2,369 చొప్పున రూ.40,273 మాత్రమే పడ్డాయి. మిగిలిన 1.20 ఎకరాలకు సంబంధించి పంట నమోదు కాకపోవడంతో 26 క్వింటాళ్లు ధాన్యం ప్రైవేట్ వ్యాపారికి విక్రయించాల్సి వచ్చింది. ఆ విధంగా ఈ రైతుకు రూ.7 వేలు నష్టం వచ్చింది.
ఎంతో మంది రైతుల వ్యధలకు ఈ ఇద్దరు కేవలం ప్రతినిధులు మాత్రమే. ఇలా ఎందరో పుడమి పుత్రులు ఈ ఖరీఫ్ సీజన్‌లో అధికారుల మాయాజాలంలో మోసపోయి.. ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో నష్టపోయారు.
కొత్తపేట: ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను కష్టాలు, నష్టాలపాలు చేస్తూనే ఉన్నాయి. రైతుల సంక్షేమం కోసం పాటు పడుతున్నామని గొప్పలు చెప్పుకొంటున్న చంద్రబాబు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వారికి మొండి చేయి చూపిస్తూనే ఉంది. రైతు పండించిన ధాన్యం అంతా కొనుగోలు చేస్తామని, దానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్తున్న ప్రభుత్వం కొంత ధాన్యానికే రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తోందని, మిగిలిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కడం లేదని పలువురు రైతులు వాపోయారు. ఉదాహరణకు కొత్తపేటలో పలువురు రైతులు తమకు ధాన్యం డబ్బులు పూర్తిగా పడలేదని, ఇదేమిటి? తాము ఇన్ని బస్తాలు తూచామని, కానీ కొన్ని బస్తాలకే డబ్బులు పడ్డాయని సంబందిత వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆరా తీస్తే ఈ–పంట నమోదు కాలేదని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ‘సాక్షి’ దృష్టికి తీసుకువచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రతి సీజన్‌లో క్షేత్ర స్థాయికి వచ్చి పండించిన పంటను ఈ–పంటలో నమోదు చేసేవారన్నారు. పండించిన ధాన్యన్ని అంతటినీ కొనుగోలు చేసేవారని, బ్యాంకు ఖాతాకు మొత్తం ధాన్యానికి డబ్బులు జమయ్యేవని తెలిపారు. సీజన్‌లో ఆదివారం, సెలవుదినం అయినా ఆ సిబ్బంది రైతుల వద్దకు వచ్చి మరీ సేవలందిచేవారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తప్ప, ప్రభుత్వ పరంగా గాని, వ్యవసాయ శాఖ పరంగా గాని ఏ విధమైన ఇబ్బందులు పడలేదని అన్నారు. నేటి చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయం పట్ల సవతి తల్లి ప్రేమతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నష్టాలు చవి చూడాల్సివస్తోందని వాపోయారు. ఈ–పంట నమోదులో మతలబు ప్రభుత్వం పరోక్షంగా అమలు చేస్తున్న విధానమా? లేక సిబ్బంది నిర్లక్ష్యమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు ఇలా..
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం గురువారం వరకు జిల్లాలోని 22 మండలాల్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 1,68,088 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. ఇంత వరకు 1,60,396 ఎకరాల్లో కోతలు పూర్తి కాగా 3,44,446 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం 205 ఆర్‌ఎస్‌కేల ద్వారా 2,82,309 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.
దాన్యం కొనుగోలులో మతలబులెన్నో
ఽపండిన ధాన్యం అంతా కొనని ప్రభుత్వం
నమోదైన మేరకే జమ అంటున్న సిబ్బంది
సిబ్బంది నిర్లక్ష్యమో.. ప్రభుత్వ విధానమో..
అర్థం కాక అన్నదాత సతమతం
వ్యవసాయ సిబ్బంది వివరణ
సొంత రైతుల భూమి మొత్తం ఈ–పంటలో నమోదైంది. కొనుగోలు చేసిన మొత్తం ధాన్యానికి డబ్బులు పడ్డాయి. జాయింట్ ఎల్‌పీఎం ఉన్న వాళ్లకు నమోదు కాలేదు. సొంత రైతుల ఆధార్ లింక్ కాక కొందరివి, కౌలు రైతులు ఆర్‌ఎస్‌కేకు ఆధార్ తీసుకురానివాళ్లవి ఈ– పంటలో నమోదు కాలేదు. పంట నమోదు అయిన మేరకే డబ్బులు పడ్డాయి.
– జి.స్వప్న, వీఏఏ, కొత్తపేట
ఈ–పంట ఏ మాయో!
ఈ–పంట ఏ మాయో!


