మస్కట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి
● అనారోగ్యం పాలైన
మహిళ
● కలెక్టర్ ఆదేశాలతో
● స్పందించిన కేసీఎం
అధికారులు
అమలాపురం రూరల్: ఉపాధి కోసం మస్కట్ వెళ్లి అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడిన పి.జ్యోతి అనే మహిళను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం) అధికారులు స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చారు. మండలం ఈదరపల్లి గ్రామానికి చెందిన జ్యోతి భర్త పి.దుర్గాప్రసాద్ వృత్తి రీత్యా వంట పని చేస్తూ జీవిస్తుంటాడు. కుటుంబ పరిస్థితులు బాగులేక తన భార్యను గల్ఫ్ దేశానికి పంపించాలని నిర్ణయించి కాకినాడకు చెందిన పి.శేషగిరిరావు అనే ఏజెంట్ ద్వారా మే నెలలో మస్కట్‌కు పంపించారు. అక్కడ 8 నెలలు పని చేసిన తర్వాత ఆరోగ్యం బాగోకపోవడంతో రెండు నెలలుగా పని చేయలేక ఇబ్బంది పడింది. ఈ మేరకు జ్యోతిని ఇండియాకు తీసుకురావాలని ఆమె భర్త మైగ్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించాడు.
ఈ మేరకు కలెక్టర్ అత్యవసర చర్యలు తీసుకుని సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుని సురక్షితంగా ఇండియాకు చేర్చాలని ఆదేశించారు. ఈ మేరకు ఆ సంస్థ జ్యోతిని స్వదేశానికి తీసుకువచ్చినట్టు ఆ కేంద్రం నోడల్ అధికారి మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్ శుక్రవారం తెలిపారు.


