సుదర్శనం.. సకల ఫలప్రదం
● అంతర్వేదిలో నిత్య హోమాలు
● 2010 నుంచి దేవస్థానంలో అమలు
● ఎఫ్‌డీల రూపంలో భక్తుల విరాళాలు
సఖినేటిపల్లి: దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన అంతర్వేది పుణ్యక్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం జన్మ జన్మల పుణ్య ఫలం. నవ బుధవార నవ ప్రదక్షిణ దీక్ష చేసి నారసింహ సుదర్శన హోమం చేయించుకోవడం ద్వారా సకల అభీష్టాలు, సర్వ కార్యాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఽఢ విశ్వాసం. ఈ క్షేత్రంలో స్వయంభువుగా స్వామివారు వెలసినట్టు చరిత్ర చెపుతోంది. వశిష్ట మహర్షి ప్రార్థన మేరకు ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా భక్తులను అనుగ్రహిస్తున్నారు.
నిత్య సుదర్శన హోమం
స్వామివారి సన్నిధిలో అత్యంత పురాతనమైన 16 ఆయుధాలు, 16 భుజాలు కలిగిన సుదర్శన చక్రధారుడైన స్వామికి (శ్రీసుదర్శన పెరుమాళ్) నిత్యం సుదర్శన హోమం నిర్వహిస్తున్నారు. భక్తుల మనోవాంఛలు, ఫలసిద్ధికి, సర్వగ్రహ దోష నివారణకు, లోక కల్యాణం కోసం ఈ హోమాలను అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.
పదిహేను సంవత్సరాలుగా
స్వామివారి సన్నిధిలో నిత్య సుదర్శన హోమం ప్రారంభించక పూర్వం భక్తులు సుమారు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ సొంత ఖర్చులతో ప్రత్యేకంగా సుదర్శన హోమం నిర్వహించుకునేవారు.
కాలక్రమంలో భక్తులందరికీ సుదర్శన హోమంలో పాల్గొనే అవకాశం కల్పించాలన్న సదుద్దేశంతో దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది ఆలోచించి, నిత్య నారసింహ సుదర్శన హోమం నిర్వహణకు నిర్ణయించారు. ఇందుకు విధి విధానాలు రూపొందించిన అనంతరం 2010 సంవత్సరంలో హోమాలను ప్రారంభించి నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు.
రుసుములు ఇలా
ఒక రోజుకు రూ.400
నెలకు రూ.4,000
మూడు నెలలకు రూ.10,000
ఆరు నెలలకు రూ.20,000
సంవత్సరానికి రూ.40,000
శాశ్వతం (పదేళ్లకు) రూ.1,00,000
సుదర్శనం.. సకల ఫలప్రదం
సుదర్శనం.. సకల ఫలప్రదం


