గుర్రపు డెక్క తొలగిస్తూ కార్మికుడి గల్లంతు
● గాలిస్తున్న గజ ఈతగాళ్లు
● నిర్వాహకుని నిర్లక్ష్యమే కారణం!
● మెషీన్‌తో తీస్తే సమస్యలకు చెక్
సామర్లకోట: స్థానిక గోదావరి కాలువలో గుర్రపు డెక్క తొలగింపు పనులలో పాల్గొన్న కార్మికుడు శుక్రవారం గల్లంతయ్యాడు. స్థానిక యానాదుల కాలనీకి చెందిన సుమారు 10 మంది కార్మికులు నాలుగు రోజులుగా మండలంలోని హుస్సేన్‌పురం నుంచి గోదావరి కాలువలో గుర్రపు డెక్క తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మాండవ్యనారాయణస్వామి ఆలయం వద్ద కాలిబాట వంతెన పంచారామ క్షేత్ర ముఖ ద్వారం వద్ద ఉన్న ఇనుప వంతెనల మధ్య గుర్రపు డెక్క తొలగిస్తూ బయటకు వస్తున్నారు. ఈ సమయంలో సామర్లకోటకు చెందిన చేవూరి లోవరాజు (40) గల్లంతు అయ్యాడు. విషయం తెలిసిన వెంటనే సహ కార్మికులు గాలింపు చర్యలు ప్రారంభించారు. గుర్రపు డెక్క తొలగిస్తూ నోటిలో కొడవలి పట్టుకుని లోవరాజు గట్టు ఒడ్డుకు వస్తున్న సమయంలో వెనుక నుంచి వస్తున్న గుర్రపు డెక్క గుట్టను గమనించక పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు తెలియజేశారు. గుర్రపు డెక్క కాలికి తగులు కోవడం వల్ల మునిగి గల్లంతై ఉండవచ్చునని ఘటనా స్థలం వద్ద ఉన్న కౌన్సిలర్, మత్స్యకారుడు మర్రి శేషారావు తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మెషీన్‌తో తీస్తే ప్రమాదాలకు చెక్ : గోదావరి కాలువలో నీటి మట్టం ఎక్కువగా ఉన్న సమయంలో కూలీలతో గుర్రపు డెక్క తొలగించడం ఎంత వరకు సమంజసమనే కూలీలు ప్రశ్నిస్తున్నారు. ఈ పనులు నీటి సంఘం చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. గత సార్వా సీజన్‌లో ఈ కాలువలో గుర్రపు డెక్క తొలగించిన మూడు నెలలకే తిరిగి పెరిగిపోయింది. అసలు గుర్రపుడెక్క పెరగకుండా ఉండడానికి అధికారులు గాని, నీటి సంఘ ప్రతినిధులు ఏమాత్రం ప్రయత్నించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జేసీబీతో గుర్రపు డెక్క తొలగింపు చేపడితే కార్మికులకు ప్రమాదం ఉండదని స్థానికులు అంటున్నారు. సామర్లకోటకు చెందిన కూలీలు గత 20 ఏళ్లుగా గుర్రపు డెక్క తీస్తున్నారు. ఈ పనులలో లోవరాజుకు 20 ఏళ్ల నుంచి అనుభవం ఉందని తోటి కార్మికులు చెప్తున్నారు. అతడికి ఇద్దరు కుమారులు ఉన్నారని, వారిలో ఒకరికి వివాహం కావలసి ఉన్నదని లోవరాజు సమీప బంధువు మాజీ కౌన్సిలర్ ధనరాజు తెలిపారు. గుర్రపు డెక్క తొలగింపునకు మెషీన్‌తో అవకాశం లేకనే కూలీలతో తీయిస్తున్నట్టు నీటి పంపిణీదారుల సంఘ చైర్మన్ కొప్పిరెడ్డి వీరాస్వామి తెలిపారు. ఐదు తూముల వద్ద, వ్యవసాయ క్షేత్రం వద్ద మెషీన్ పెడతామన్నారు.
చేతులు కాలాక..
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నీటి సంఘ ప్రతినిధుల పనితీరు ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. గుర్రపు డెక్క తీతలో ఓ కార్మికుడు గల్లంతయ్యాక మెషీన్‌తో తొలగింపు ప్రారంభించడం చర్చనీయాంశమైంది. గల్లంతైన లోవరాజు కోసం గజ ఈతగాళ్లు గాలించినా ఫలితం లేక పోవడంతో గుర్రపు డెక్కలో చిక్కుకుని ఉండవచ్చునని జేసీబీతో గాలిస్తున్నట్లు గుర్రపు డెక్క తొలగింపు కాంట్రాక్టరు తెలిపారు.
గుర్రపు డెక్క తొలగిస్తూ కార్మికుడి గల్లంతు


