సమన్వయంతో నరసన్న కల్యాణోత్సవాలు
అధికారులకు జేసీ నిషాంతి ఆదేశం
అమలాపురం రూరల్: అంతర్వేది శ్రీలక్ష్మీ నర సింహస్వామి వారి దివ్య తిరు కల్యాణ మహోత్సవాలు శాఖల సమన్వయంతో వైభవంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.నిషాంతి అధికారులను ఆదేశించారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య తిరు కళ్యాణ మహోత్సవాల నిర్వహణపై రెండో దఫా సమీక్ష సమావేశం గురువారం జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించి ఉత్సవాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ గత ఏడాది కన్నా 20 శాతం భక్తుల తాకిడి పెరగవచ్చని, ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తుల క్యూ లు, స్నాన ఘట్టాలు, లైటింగ్, ఎల్‌ఈడీ స్క్రీన్లు, ఆరు బయట స్వామి వారి కల్యాణం తిలకించేందుకు ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని ఆదేశించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని సూచించారు. డీపీవో పారిశుధ్య ఏర్పాట్లు, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ తాగునీటి సరఫరా ఏర్పాట్లు, పంచాయతీరాజ్ ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు రోడ్ల మరమ్మతుల చేయాలన్నారు. గజ ఈతగాళ్లతో నాలుగు బోట్ల ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆహార కల్తీ ,తూనికలు కొలతల్లో మోసాలు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్‌ఓ కే.మాధవి ఆర్డీవోలు పి శ్రీకర్, డీ అఖిల పాల్గొన్నారు.
నాలుగు రీచ్‌లలో
టెండర్లు ఖరారు
అమలాపురం రూరల్: జిల్లాలో నాలుగు సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచులలో ఇసుక తవ్వకాలు, లోడింగ్ నిల్వ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా స్థాయి కమిటీ సీల్డ్ టెండర్లు పిలువగా 20 మంది టెండర్లు దాఖలు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాంతి వెల్లడించారు. గురువారం సీల్ టెండర్లు తెరచి నాలుగింటిని ఫైనలైజ్ చేసినట్టు తెలిపారు. ఆలమూరు మండలం జొన్నాడ, ఆత్రేయపురం మండలం మెర్లపాలెం, ఆలమూరు మండలం ఆలమూరు, కపిలేశ్వరపురం రీచ్‌లకు ఖరారు చేసినట్టు వివరించారు.
ఈ – ఆఫీస్ నిర్వహణ కీలకం
ప్రభుత్వ కార్యాలయాలలో ఈ – ఆఫీస్ నిర్వహణ కీలక పాత్ర పోషిస్తుందని జేసీ నిషాంతి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో సిబ్బందికి ఈ–ఆఫీస్ నిర్వహణ అంశాల పట్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించి కార్యాలయంలో అమలు చేయాల్సిన ఈ–ఆఫీస్ నిర్వహణ అంశాలు వాటికి సంబంధించిన విధానాలపై శిక్షణ ఇచ్చారు.
ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష
అమలాపురం రూరల్: జిల్లాలో రానున్న జనవరి మాసంలో నిర్వహించే ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే మాధవి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో జనవరి మాసంలో నిర్వహించే ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో ఆమె సమీక్షించారు. వచ్చే నెలలో భోగి, సంక్రాంతి, కనుమ పండగలు, జనవరి 16వ తేదీన ప్రభల తీర్థం, డిసెంబర్ 30న ముక్కోటి ఏకాదశి, జనవరి 31న అంతర్వేది శ్రీలకీ్‌ష్మ్‌నరసింహస్వామి కల్యాణోత్సవాలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు జరగాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి ఆలయం వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాని, అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. గోదాదేవి కల్యాణం ప్రశాంత వాతావరణంలో జరగాలన్నారు. జనవరి 31 మందపల్లి శనీశ్వర ఆలయంలో శని త్రయోదశి పూజలు నిర్వహణకు భక్తులకు పూర్తిస్థాయిలో వసతులను కల్పించాలన్నారు. కాలువలు సముద్రపు స్నాన ఘట్టాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. జనవరి 16న అంబాజీపేట మండలంలో నిర్వహించే ప్రభల తీర్థానికి రహదారులు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంలో వార్షిక కల్యాణోత్సవం జనవరి 28న వైభవంగా నిర్వహించాలన్నారు. జనవరి 31 భీష్మ ఏకాదశి రథోత్సవం ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్డీవోలు పి.శ్రీకర్ డి.అఖిల, దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ వివిధ దేవాలయాల కార్య నిర్వహక అధికారులు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.


