మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సీపీఐ ధర్నా
అమలాపురం రూరల్: పీపీపీ పద్ధతిలో నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం జారీచేసిన జీఓ 590 రద్దు చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో అమలాపురం మండలం కామనగరువులో మెడికల్ కళాశాల భవనాల వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి వర్గాలకు మెడికల్ విద్యను దూరం చేసే విధంగా జీవో 590తో గత ప్రభుత్వం తీసుకువచ్చిన 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పజెప్పడాన్ని సీపీఐ ఖండిస్తోందన్నారు. వైద్య విద్యను అభ్యసించాలనే పేద వారి కలలను దూరం చేసి వైద్యాన్ని అమ్ముకునే కార్పొరేట్ డాక్టర్లను తయారు చేయడం కోసం కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పగిస్తోందన్నారు. 66 సంవత్సరాలు లీజుకి ఇచ్చి, నిర్వహణ బాధ్యతలు వారికి ఇస్తే రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి ఉచితంగా విద్య, వైద్యం ఎలా అందిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టాలని చూడడం సిగ్గుచేటని అన్నారు. గూగుల్ డేటా సెంటర్‌కి రూ.22,000 కోట్ల రాయితీలు, కంపెనీలకు 99 పైసలకు వేల ఎకరాలు ఇవ్వగలిగిన వారు కేవలం రూ.5,000 కోట్లతో మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేదని విమర్శించారు. దీన్ని కూటమి ప్రభుత్వం చేతకానితనం అనాలా లేక కార్పొరేట్ వారికి దాసోహం అనాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతుందని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కె.సత్తిబాబు మాట్లాడుతూ ఇది ప్రజా ఉద్యమం, ప్రజా గొంతుగా సీపీఐ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తుందని అన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాము, వెంకటేష్, రామకృష్ణ, తాతాజీ, రవికుమార్, సమితి సభ్యులు చిట్టూరి ప్రసాద్, చిట్టూరి సత్యనారాయణ, గుత్తి నాగేశ్వరరావు, ఆనంద్, ప్రేమానందం, తాడి సత్యనారాయణ, భీమరాజు, నాగబాబు, వెంకట్ పాల్గొన్నారు.


