కొనసాగులేం!
ఆలమూరు: అధికారమే పరమావధిగా అమలు కాని హామీలు, శుష్క వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఇప్పటికే అన్ని వర్గాలనూ మోసగించింది. ఉచిత పంటల బీమాను రద్దు చేసి మోంథా తుపాను పరిహారం అందించకుండా రైతులను వంచించింది. ఈ క్రమంలోనే వ్యవసాయశాఖలో పని చేస్తున్న అగ్రికల్చరల్ అసిస్టెంట్లను వెన్నుపోటు పొడిచింది. గ్రామ సచివాలయాల్లో అరకొర వేతనాలతో బండ చాకిరీ చేస్తున్న అగ్రికల్చరల్ అసిస్టెంట్లు చేసిన సేవలకు గాను అదనంగా ఇస్తానన్న భృతిని కూడా మంజూరు చేయకుండా చేతులేత్తేసింది.
జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలో 2.3 లక్షల ఎకరాల్లో 1.78 లక్షల మంది రైతులు వరి, వాణిజ్య, ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. అందులో 1.62 లక్షల ఎకరాల్లో 1.05 లక్షల మంది వరి, 1.21 లక్షల ఎకరాల్లో 73 వేల మంది ఉద్యాన, వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. జిల్లాలోని 515 గ్రామ సచివాలయాల్లో అగ్రికల్చరల్ అసిస్టెంట్లు ఉండగా ఇటీవల ప్రభుత్వం హేతుబద్ధీకరణ పేరిట వారి సంఖ్యను 377కు కుదించింది. ఒక్కొక్క అసిస్టెంట్‌కు రెండు లేదా మూడు గ్రామ సచివాలయాల బాధ్యతను అప్పగించి అదనపు భారం మోపింది.
నిర్లక్ష్య వైఖరి
అగ్రికల్చరల్ అసిస్టెంట్లు పని చేయడమే తప్ప, ప్రశ్నించకూడదనే ఉద్దేశం ఉన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ (ఏపీఎఫ్‌ఆర్) యాప్‌లో పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులందరినీ నమోదు చేసి యూనిక్ సంఖ్యను కేటాయించాలని వ్యవసాయశాఖ సూచించింది. దానిలో భాగంగా అగ్రికల్చరల్ అసిస్టెంట్లు అందిస్తున్న అదనపు సేవలకు గాను ఒక్కొక్కరికి రూ.15 వేలు అందిస్తామని బహిరంగంగా ప్రకటించింది. అయితే పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులందరికీ రిజిస్ట్రేషన్ చేసి ఏడాది కావస్తున్నా వారికి అందించాల్సిన రూ.77.25 లక్షలను ప్రభుత్వం ఇంకా మంజూరు చేయలేదు. అలాగే ఈ– క్రాప్ బుకింగ్ కింద పంట నమోదు చేస్తే ఒక్కొక్క సర్వే నంబర్‌కు రూ.10 ఇస్తానని తెలిపింది. రెవెన్యూ గణాంకాలను బట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు లక్షకు పైగా సర్వే నంబర్లలో ఉన్న భూమికి ఈ– క్రాప్ బుకింగ్ చేసినా.. ప్రభుత్వం ఒక పైసా ఇచ్చిన పాపాన పోలేదు. ఖరీఫ్ సీజన్‌లో అగ్రికల్చరల్ అసిస్టెంట్లకు సంబంధించి సుమారు రూ.పది లక్షల వరకు పభుత్వం బకాయి పడింది.
అరకొర నిధులు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విజయవంతంగా నిర్వహించిన రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చిన చంద్రబాబు సర్కార్ ఆ మేరకు సేవలను కుదించి వేసింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ప్రతి ఆర్‌ఎస్‌కే నిర్వహణకు ఇస్తామన్న రూ.పది వేలను కుదించి కేవలం రూ.ఐదు వేలు మాత్రమే అగ్రికల్చరల్ అసిస్టెంట్ల ఖాతాలో వేశారు. ఒక్క ఆర్‌ఎస్‌కే నిర్వహణకు సంబంధించి తాగునీరు, ట్రక్ షీట్, స్టేషనరీ, ప్రింటర్ సామగ్రికి విపరీతమైన ఖర్చు అవుతోందని, ఇలా అరకొర నిధులు కేటాయిస్తే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. తమ వేతనాల నుంచి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక, అధికారులను నిలదీయలేక, ఆర్‌ఎస్‌కే అదనపు ఖర్చులు భరించలేక అగ్రికల్చరల్ అసిస్టెంట్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
అగ్రికల్చరల్ అసిస్టెంట్ల ఆవేదన
రైతు సేవకులకు
చంద్రబాబు సర్కార్ రిక్తహస్తం
ఏపీఎఫ్‌ఆర్ చేస్తే
ఇస్తానన్న డబ్బులు నిలిపివేత
ఈ– క్రాప్ సర్వే నంబరు
సొమ్ములకు ఎగనామం
ఆర్‌ఎస్‌కే నిర్వహణ ఖర్చు
రూ.ఐదు వేలకు పరిమితం
జిల్లాలో రూ.కోటికి పైన
బకాయి పడిన ప్రభుత్వం
అగ్రికల్చరల్ అసిస్టెంట్లకు చెల్లించాల్సిన బకాయిలు (సుమారు)
ఆంధ్ర ప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ రూ.77.25 లక్షలు
ఈ – క్రాప్ బుకింగ్ రూ.10 లక్షలు
ఆర్‌ఎస్‌కే నిర్వహణ చార్జీలు రూ.18.85 లక్షలు
కొనసాగులేం!
కొనసాగులేం!


