ఉచిత వైద్యం అందించింది వైఎస్ కుటుంబమే
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
● మలికిపురంలో
కోటి సంతకాల విజయోత్సవం
మలికిపురం: రాష్ట్రంలో ప్రజలకు ఉచిత వైద్యం అందించింది వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబమేనని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మలికిపురంలో మంగళవారం రాజోలు నియోజకవర్గ కోటి సంతకాల సేకరణ విజయోత్సవ సభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పేరుతో నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేదలకు ఉచిత వైద్యం అందించారని, కరోనా సమయంలో సీఎంగా ఉన్న జగన్.. ప్రభుత్వాస్పత్రుల ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలు చేశారన్నారు. రాష్ట్రానికి ఏకకాలంలో 17 మెడికల్ కాలేజీలను తెచ్చిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. అటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారన్నారు. తెలంగాణలో 300 మార్కులు వచ్చిన వారికి కూడా ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయని, కానీ మన రాష్ట్రంలో 400 మార్కులు వచ్చినా సీట్లు రాలేదంటే కారణం ఏంటో చంద్రబాబు గమనించాలని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వం కళ్లు తెరవాలని హితవు పలికారు. ఇండిగో ఎయిర్ లైన్స్ ఫెయిల్యూర్ ద్వారా దేశంలోనే పరువు తీసిన ఘనత విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడిదే దన్నారు.
కూటమిలో గొడవలు
పార్టీ పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు చేతిలో రాష్ట్రాన్ని పెట్టి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారన్నారు. కూటమి పేరుతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నప్పటికీ, లోపల అనేక గొడవలతో కూటమి సతమతం అవుతోందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ నియోజక వర్గంలో 53,046 సంతకాలు పూర్తి చేసినట్లు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న వ్యతిరేకతకు ఈ సంతకాల సేకరణకు వచ్చిన ప్రజా స్పందనే నిదర్శనమన్నారు. పార్టీ రాజోలు పరిశీలకుడు కర్రి పాపారాయుడు మాట్లాడుతూ ప్రజలు పార్టీలకు అతీతంగా కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు మట్టపర్తి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య కుమార్, సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చిన్నరాజా, ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి నల్లి డేవిడ్, రాష్ట్ర బీసీ సెల్ కాార్యదర్శి గుబ్బల మనోహర్, జెడ్పీటీసీ మట్టా శైలజ, పార్టీ మండల అధ్యక్షులు అడబాల వీర బ్రహ్మాజీరావు, కట్టా శ్రీనివాసరావు, కుసుమ చంద్రశేఖర్, బొలిశెట్టి భగవాన్, సర్పంచ్ గెడ్డం రాజ్యలక్ష్మి, కొప్పిశెట్టి సీతామహాలక్ష్మి, గుబ్బల రోజా రమణి, జాన శంకరరావు, మంగెన సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.


