విఘ్నేశ్వరునికి రూ.46.30 లక్షల ఆదాయం
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయ హుండీ ఆదాయాన్ని జిల్లా దేవదాయశాఖ అధికారి వి.సత్యనారాయణ, ఆలయ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో మంగళవారం లెక్కించారు. 91 రోజులకు గాను రూ.46,30,239 లభించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. ఇంకా వెండి 219.9 గ్రాములు, బంగారం 4.2 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 20 లభించాయన్నారు. హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
డీఈవోగా నాగేశ్వరరావు
ముమ్మిడివరం: జిల్లా విద్యాశాఖాధికారిగా పి.నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఇప్పటివరకూ విధులు నిర్వర్తించిన షేక్ సలీం బాషా గుంటూరు జిల్లాకు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో జరిగిన బదిలీల్లో భాగంగా ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ మంగళవారం ఈ ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ –1గా విధులు నిర్వర్తిస్తున్న పి.నాగేశ్వరరావుకు డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
మస్కట్ నుంచి స్వదేశానికి..
అమలాపురం రూరల్: ఉపాధి కోసం మస్కట్ వెళ్లి, ఏజెంట్ చేతిలో మోసపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం) అధికారులు సురక్షితంగా స్వదేశానికి రప్పించారు. వివరాల్లోకి వెళితే.. మామిడికుదురు చెందిన కె.మంగాదేవి మార్చిలో బొక్కా శ్రీను అనే ఏజెంట్ ద్వారా ఉపాధి కోసం మస్కట్ వెళ్లింది. అక్కడ ఆమెను వివిధ ప్రాంతాల్లో పనికి తిప్పుతూ ఏజెంట్ మోసం చేశాడు. అక్కడ అవస్థలు పడలేక ఇండియాకు వద్దామంటే పంపడం కుదరదని చెప్పాడు. దీంతో మంగాదేవి తన కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిపింది. వారు కలెక్టరేట్‌లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను ఆశ్రయించారు. కలెక్టర్ మహేష్ కుమార్ చొరవతో, కేసీఎం బృందం అక్కడ సంప్రదింపులు జరిపి, అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసింది. దీంతో మంగాదేవి సోమవారం స్వదేశానికి చేరుకుంది. అనంతరం కేంద్రం నోడల్ అధికారి కె.మాధవిని మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపింది.
యథాతథంగా మాదిగల
ఆత్మీయ కలయిక
అమలాపురం టౌన్: అమలాపురం పట్టణం కొంకాపల్లి సత్తెమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 11న మాదిగల ఆత్మీయ కలయిక సదస్సు యథాతథంగా జరుగుతుందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాదిగ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం వాయిదా పడిందంటూ వస్తున్న వదంతులు, జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మవద్దన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 11న ఉదయం 10 గంటల నుంచి మాదిగల ఆత్మీయ కలయిక పార్టీలకు అతీతంగా జిల్లా స్థాయిలో జరుగుతుందన్నారు. మాదిగల ఐక్యత కోసం నిర్వహిస్తున్న ఈ ఆత్మీయ కలయిక కోసం జిల్లాలోని మాదిగ నేతలంతా అంతే ఐక్యత సాధించే దిశగా శ్రమించాలని ఇజ్రాయిల్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీతో పాటు మాదిగ నాయకులు యార్లగడ్డ రవీంద్ర, మడకి శ్రీరాములు, తెన్నేటి రాజబాబు, మల్లవరపు శ్రీను, మెరుగుపువ్వు మోహన్, ఉందుర్తి ప్రసాద్, సవరపు నానిబాబు, బుంగ ఆనంద శేఖర్, ఆకుమర్తి దుర్గారావు ఈ ప్రకటన విడుదల చేశారు.
నేటి నుంచి సౌత్ జోన్
వాలీబాల్ పోటీలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల వాలీబాల్ పోటీలు బుధవారం నుంచి కాకినాడలో ఐదు రోజుల పాటు జరగనున్నాయి. అసోషియేషన్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ఆధ్వర్యాన నిర్వహించే ఈ పోటీలకు జేఎన్‌టీయూకే వేదిక కానుంది. వర్సిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జేఎన్‌టీయూకే వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 14 వరకూ జరిగే ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం నుంచి 138 జట్లు పాల్గొంటున్నా యని వివరించారు. ఈ జట్లను నాలుగు పూల్స్‌గా విభజించామన్నారు. పూల్–ఎ, బి మ్యాచ్‌లు జేఎన్‌టీయూకే, పూల్–సి అచ్చంపేట రాజీవ్‌గాంధీ కళాశాల, పూల్–డి సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో జరుగుతాయని వివరించారు. రాత్రి వేళ ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో సైతం మ్యాచ్‌లు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పోటీల్లో 1,960 మంది క్రీడాకారులతో పాటు 360 మంది కోచ్‌లు, మేనేజర్లు, వాలీబాల్ టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొంటారని తెలిపారు. ఈ టోర్నీలో ప్రతిభ చూపిన వారు మణిపాల్ జైపూర్ యూనివర్సిటీలో నిర్వహించే ఆలిండియా అంతర్ వర్సిటీ పోటీలకు అర్హత సాధిస్తారని వీసీ ప్రసాద్ చెప్పారు.
విఘ్నేశ్వరునికి రూ.46.30 లక్షల ఆదాయం
విఘ్నేశ్వరునికి రూ.46.30 లక్షల ఆదాయం


