వాడపల్లి క్షేత్రంలో శరవేగంగా అభివృద్ధి పనులు
● వైఎస్సార్ సీపీ హయాంలో శ్రీకారం
● ఇప్పటికే పలు పనులు పూర్తి
● మరికొన్ని నిర్మాణ దశలో..
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీ భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో అన్న ప్రసాద భవనం, కోనేరు తదితర పలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి రూ.55 కోట్లతో వాడపల్లి క్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఆ మేరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, స్వీకరించింది. ఆ క్షేత్ర అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి నిధులు మంజూరు చేసింది. అప్పటి దేవస్థానం పాలక మండలి చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు ఆధ్వర్యంలో ఆయా పనులకు శ్రీకారం చుట్టారు. ఈ క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ఆవరణలో గోశాల, భారీ రేకుషెడ్లు, అన్నదాన భవన నిర్మాణం తదితర వాటిని ప్రారంభించారు. రూ 5.5 కోట్లతో వకుళమాత అన్న ప్రసాద భవనం ఏర్పాటు చేస్తున్నారు. స్వామి వారి తెప్పోత్సవం నిర్వహించేందుకు తిరుమల దేవస్థానం తరహలో రూ.2.50 కోట్లతో కోనేరు నిర్మిస్తున్నారు. కాలినడకన వచ్చే భక్తులకు విశ్రాంతి, సామూహిక వివాహలు, ఉపనయనాలు జరిపేందుకు వీలుగా మూడు అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టారు. అప్పటి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పిలుపునందుకుని పలు నిర్మాణాలకు దాతలు ముందుకు వచ్చారు. ఇప్పటికే అనేక నిర్మాణాలు పూర్తి చేశారు.
వాడపల్లి క్షేత్రంలో శరవేగంగా అభివృద్ధి పనులు


