తుపానుతో నిలిచిన ఆర్టీసీ బస్సులు
అమలాపురం రూరల్: మోంథా తుపాను ప్రభావం కారణంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నాలుగు ఆర్టీసీ డీపోల పరిధిలో బస్సు సర్వీసులను నిలిపివేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అమలాపురం, రాజోలు, రామచంద్రపురం, రావులపాలెం ఆర్టీసీ డీపోలో పరిధిలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి బస్సులు నిలిపివేసినట్లు జిల్లా ప్రజా రవాణా ఎస్‌టీపీ అధికారి రాఘవకుమార్ చెప్పారు. జిల్లాలో నాలుగు డిపోల పరిధిలో 327 బస్సులకు గాను 170 సర్వీసులను రద్దు చేశామన్నారు. అమలాపురం డిపో పరిధిలో 138 బస్సు సర్వీసులు ఉండగా ఉదయం నుంచి కొన్ని రూట్లలో 52 సర్వీసులు మాత్రమే నడిపినట్లు తెలిపారు. 86 బస్సు సర్వీసులను రద్దు చేశారు. హైదారాబాద్, విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం రూట్లతో పాటు పల్లెవెలుగు సర్వీసులు రద్దు చేశారు. రాజోలు డిపో పరిధిలో 57 బస్సు సర్వీసులు ఉండగా 38 సర్వీసులు మాత్రమే నడిపారు. రావులపాలెంలో డిపో పరిధిలో 69 బస్సు సర్వీసులు ఉండగా 37 మాత్రమే నడిపారు. రామచంద్రపురం డిపో పరిధిలో 63 బస్సు సర్వీసులు ఉండగా 30 సర్వీసులు మాత్రమే నడిపారు. ప్రయాణికులు ఎవరూ బస్టాండ్‌కి రావద్దని తెలిపారు. తుపాను పరిస్థితిని బట్టి బుధవారం బస్సులు నడుపుతామని తెలిపారు. రోజూ జిల్లాలో నాలుగు డిపోల పరిధిలో రూ.80 లక్షల ఆదాయం వస్తుందన్నారు.


