హోర్డింగ్‌ల తొలగింపు
● డ్రోన్లతో తుపాను
ప్రభావిత ప్రాంతాల పర్యవేక్షణ
● ఎస్పీ రాహుల్ మీనా
అమలాపురం టౌన్: తుపాను ప్రభావంతో బలంగా వీస్తున్న గాలులకు భవనాలపై, కూడళ్లలో ఉన్న హోర్డింగ్‌లను తొలగించే ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు హోర్డింగ్‌లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికో డీఎస్పీని, మండలానికో సీఐని నియమించి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు, 22 మండలాల్లో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బందితో పాటు ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల పర్యవేక్షణ 24 గంటలూ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలసి ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కి లేదా సమీపంలో గల పోలీస్ అధికారులకు, పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


