పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
కొత్తపేట: మోంథా పెను తుపాను నేపథ్యంలో పునరావాస కేంద్రాలకు తీసుకువచ్చిన నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని, పలు గ్రామాలను మంగళవారం జెడ్పీ చైర్మన్ సందర్శించారు. అక్కడ ఉన్నవారి వివరాలు, వసతి సౌకర్యాలు, కేంద్రంలో వారికి అందిస్తున్న సేవల గురించి సెంటర్ పర్యవేక్షణ అధికారులు, సిబ్బందిని ఆరా తీశారు. వారికి పాలు, ఆహారం, అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలులు, భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలను అప్రమత్తం చేయాలని సర్పంచ్, సచివాలయం, ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సూచించారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండవద్దని, ముఖ్యంగా చెట్లు, విద్యుత్‌లైన్ల కింద, శిథిలావస్థకు చేరిన ఇళ్లు, షెడ్లు, పూరిపాకల్లో ఉండవద్దని హెచ్చరించారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. లైన్లపై చెట్ల కొమ్మలు పడి వైర్లు తెగినా ప్రమాదం జరగకముందే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు తీసుకునేలా సిద్ధంగా ఉండాలని సూచించారు.
జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు


