
ఇజ్రాయిల్‌లో కోనసీమ వాసి మృతి
సాక్షి, అమలాపురం: ఉపాధి కోసం ఇజ్రాయిల్ వెళ్లిన కోనసీమ వాసి అక్కడ జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. సెప్టెంబరు 30 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అతడి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించింది. వివరాల్లోకి వెళితే.. రావులపాలేనికి చెందిన వానపల్లి ప్రసాద్ (35) ఇజ్రాయిల్ దేశంలో కార్మికుడిగా పనిచేసేందుకు 2024 మే నెలలో వెళ్లాడు. అదే ఏడాది జూన్ నెలలో అషూద్ పట్టణంలోని ఒక సిమెంట్ కంపెనీలో చేరాడు. పరిశ్రమలో మెషీన్‌ను శుభ్రం చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. గమనించిన సిబ్బంది అతడిని రక్షించేందుకు చేసిన యత్నాలు ఫలితమివ్వలేదు.
మృతదేహం తీసుకువచ్చేందుకు..
మృతుడు ప్రసాద్ తండ్రి వానపల్లి సత్తిరాజు రావులపాలెం కొత్త కాలనీలో నివాసముంటున్నాడు. కంపెనీ యాజమాన్యం ప్రసాద్ మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీనితో వారు కంగారుపడి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావును సంప్రదించగా, ఆయన కలెక్టర్‌కు పరిస్థితి వివరించారు. బాధిత కుటుంబ సభ్యులు కలెక్టరేట్‌లోని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను సంప్రదించి ప్రసాద్ మృతదేహాన్ని రా వులపాలెం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని కోరారన్నారు. కోనసీమ మైగ్రేషన్ బృందం భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు.
ఆర్థిక సాయం
మృతుడు తండ్రి సత్తిరాజు బుధవారం కలెక్టరేట్‌కు వచ్చి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు సహకరించాల్సిందిగా మరోసారి అధికారులను కోరారు. కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు భారత రాయబార కార్యాలయ అధికారుల తోపాటు ఇజ్రాయిల్ కన్‌స్ట్రక్షన్ తెలుగు వర్కర్స్ అసోసియేషన్‌తో కూడా బృందం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ప్రసాద్ తల్లిదండ్రులు పేద కుటుంబానికి చెందినవారని తెలిసి ఇజ్రాయిల్ కన్‌స్ట్రక్షన్ తెలుగు వర్కర్స్ అసోసియేషన్‌న్ పంపిన రూ.2.07 లక్షల ఆర్థిక సాయాన్ని సత్తిరాజుకు కలెక్టర్ అందించారు. బాధితులకు ప్రభుత్వం ద్వారా తగిన సహాయ అందిస్తామని, కంపెనీ ద్వారా అందవలసిన ఇన్సూరెన్సులు ఉంటే వాటిని రాబట్టే ప్రయత్నం చేస్తామని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో నోడల్ అధికారి కె.మాధవి, సమన్వయ అధికారి జి. రమేష్, సిబ్బంది ఎంఎం సఫియా, సత్తిబాబు, దుర్గ పాల్గొన్నారు.
నూతన వరి వంగడాలను సాగు చేయించాలి
అమలాపురం రూరల్: రానున్న రబీ సీజన్‌లో నూతన వరి వంగడాలు, ఎగుమతికి ఉపయోగపడే సన్న రకాలను రైతులతో సాగు చేయించాలని వ్యవసాయాధికారులకు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సూచించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో రబీ సీజన్ సన్నద్ధతపై సమీక్షించారు. బొండాలు 3626 రకాలకు బదులు 1232, 1239 సన్న రకాలు వినియోగించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలని ఆదేశించారు. శాస్త్రవేత్త శ్రీనివాసన్ మాట్లాడుతూ సేంద్రియ ఎరువులు వేసే సందర్భంలో నేలలో భౌతిక పరిస్థితి, నీటి సరఫరా, పంట అవశేషాల నిర్వహణ తప్పనిసరి అన్నారు.
ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి, నూరు శాతం నాణ్యతతో పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి బుధవారం బుధవారం అమరావతి నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలన్నారు.