
వన భోజనాల ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు
అమలాపురం టౌన్: కార్తిక మాసం సందర్భంగా జిల్లాలోని ప్రముఖ ఆలయాలు, నదీ తీరాలు, వన సమారాధనలు జరిగే ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశించారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో బుధవారం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తిక సోమవారాలు, పౌర్ణమి రోజున ముఖ్యంగా శివాలయాలు, నదీ స్నాన ఘట్టాల వద్ద భక్తులు అధిక సంఖ్యలో ఉంటారని, అక్కడ పకడ్బందీ భద్రతా చర్యలు ఉండాలన్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా పార్కింగ్ స్థలాలను ముందే గుర్తించాలని, వాటి సమాచారాన్ని భక్తులకు తెలియజేయాలన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్ నిఘా పెంచాలని ఆదేశించారు. వన భోజనాలు, దీపారాధనలు చేసే చోట్ల అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.