
హోటళ్లపై దుష్ప్రచారం తగదు
అమలాపురం టౌన్: అమలాపురంలోని కొన్ని మాంసాహార హోటళ్లపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరుగుతోందని అమలాపురం పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్, పట్టణ హోటళ్ల అసోసియేషన్ వ్యాపార ప్రతినిధులు అన్నారు. స్థానిక గడియారం స్తంభం సెంటర్‌లోని ఓ హోటల్లో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామర్స్ అధ్యక్షుడు బోణం సత్య వరప్రసాద్, హోటళ్ల అసోసియేషన్ ప్రతినిధులు నల్లా పవన్ కుమార్, కోకా రాంబాబు మాట్లాడారు. ఇటీవల అమలాపురంలోని ఓ మాంసాహార హోటల్లో తేలు ఉన్న పలావు తిని ఒక యువకుడు చనిపోయాడని సోషల్ మీడియాలో ఓ నకిలీ వార్త హల్‌చల్ చేసిందన్నారు. ఆ యువకుడు అనారోగ్య కారణంతోనే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారన్నారు. కానీ సోషల్ మీడియాలో హోటళ్లపై విష ప్రచారం చేయడం భావ్యం కాదన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నల్లా విష్ణుమూర్తి, చాంబర్ ఉపాధ్యక్షుడు కొమ్మూరి వెంకటాచల ప్రసాద్, పలు హోటళ్ల నిర్వాహకులు గారపాటి వంశీ, చిక్కం గణేష్, డి.నాయుడు, బాలు, సురేష్ నాయుడు పాల్గొన్నారు.