
పేలని పటాస్..
సాక్షి, అమలాపురం: ఒకవైపు పెరిగిన బాణసంచా ధరలు.. మరోవైపు రాయవరం ఘటనతో బాణసంచా దుకాణాలపై పెరిగిన నిఘా.. ఇంకోవైపు అనుమతుల పేరుతో అడ్డుగోలు దోపిడీకి తెరదీసిన వివిధ శాఖలు.. ఇవన్నీ సరిపోవన్నట్టు ఆదివారం తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షంతో దీపావళి టపాస్ పేలడం లేదు. పండగ వచ్చినా సందడి కానరావడం లేదు. జనం వద్ద కొనుగోలు శక్తి తగ్గడంతో పాటు, పెరిగిన ధరలు కావచ్చు.. ఏదేమైనా బాణసంచా దుకాణాలు వెలవెలబోతున్నాయి.
జిల్లాలో దీపావళి సందడి కనిపించడం లేదు. ఖరీఫ్ సాగు ఉత్సాహంగా లేదు. ఆక్వా, పౌల్ట్రీ ఆశాజనకంగా లేదు. గోదావరి వరదలతో ఉద్యాన సాగు లాభసాటిగా లేదు. ప్రజల్లో కొనుగోలు శక్తి కానరావడం లేదు. ఈ ప్రభావం పండగలపై పడింది. దీపావళిపై ఇది స్పష్టంగా కనబడుతోంది. పండగ చేసుకునే ఉత్సాహం జనంలో బాగా తగ్గింది. దీనికితోడు టపాసుల ధరల మోత మోగుతుంది. గత ఏడాదితో పోలిస్తే 20 నుంచి 40 శాతం మేర పెరగడంతో వినియోగదారులను బేజారెత్తిపోతున్నారు.
ముడి సరకుల ధర పెరగడం, స్థానికంగా తయారీ తగ్గిపోవడం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. బొగ్గు, గంధకం, సూరేకారం, బేరియం, పొటాష్, నైట్రేట్ వంటి ముడి సరకుల ధరలు గణనీయంగా పెరిగాయి. దీనివల్ల బాణసంచా ఆకాశాన్నంటడంతో అధికంగా టపాసులు కొనేందుకు వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారు.
వర్షం కారణంగా వెలవెలబోతున్న అమలాపురం బాలయోగి స్టేడియంలో బాణసంచా దుకాణాలు
ఆంక్షలు.. లంచాలు
బాణసంచా దుకాణదారులకు ఈ ఏడాది కలిసి రాలేదు. జిల్లాలో అమలాపురం, మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీ, ముమ్మిడివరం నగర పంచాయతీతో పాటు 22 మండలాల్లో 18 బాణసంచా తయారీ కేంద్రాలు ఉండగా, 15 హోల్‌సేల్ దుకాణాలు ఉన్నాయి. 455 తాత్కాలిక దుకాణాలకు అనుమతి మంజూరు చేశారు. స్థానిక వ్యాపారులు పశ్చిమగోదావరి జిల్లా దువ్వ, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలోని కొత్తపేట, జిల్లాను ఆనుకుని ఉన్న యానాం నుంచి పెద్ద ఎత్తున బాణసంచా కొనుగోలు చేసి నిల్వ చేశారు. దీనితోపాటు తమిళనాడులోని శివకాశి వంటి ప్రాంతాల నుంచి బాణసంచా తెచ్చుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి అమ్మకాలు మొదలు కాగా, ఈ రెండు రోజులు కలిపి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.15 కోట్ల మేర వ్యాపారం జరుగుతోందని అంచనా.
ఈ నెల ఆరంభంలోనే బాణసంచా వ్యాపారులకు ఎదురు దెబ్బలు తగిలాయి. రాయవరంలో జరిగిన పెను విస్ఫోటంలో పది మంది మృత్యువాత పడ్డారు. అంతకు ముందు అయినవిల్లి మండలం విలసలో నిల్వ ఉంచిన బాణసంచా పేలి భార్యాభర్తలు మృతి చెందారు. ఈ ఘటనలు వ్యాపారుల సెంటిమెంట్‌లను దెబ్బతీశాయి. దీనితో అధికారులు నిల్వల తనిఖీ పేరుతో గత ఏడాది అమ్మకాలు చేయగా మిగిలిపోయిన బాణసంచాను స్వాఽధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో నిల్వ పేరుతో పోలీస్, రెవెన్యూ పెద్ద ఎత్తున సొమ్ములు కూడా చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. దీనితో తాత్కాలికంగా వ్యాపారాలు చేసుకునే రిటైల్ వ్యాపారులు ముందుగా కొనుగోలు చేయలేకపోయారు. ఇది కూడా వ్యాపారం తగ్గడానికి ఒక కారణమైంది.
దీనికితోడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఆదివారం తెల్లవారు జాము నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తూనే ఉంది. సాయంత్రం కొంత తెరపి ఇవ్వడంతో కాస్త వ్యాపారం సాగింది. మరో నాలుగు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ధరలు ఇలా.. (రూ.లలో):
బాణసంచా రకం గతేడాది ఈ ఏడాది
(సుమారు)
అగ్గిపెట్టెలు (10 బాకు్‌ుస్ల) 550 750
మతాబులు (12) 96 120
కాకర పువ్వొత్తులు 600 750
(10 బాక్సు చిన్నవి)
విష్ణుచక్రాలు (10) 100 180
చిచ్చుబుడ్లు (డజను) 180 260
చిచ్చుబుడ్లు 240 360
(డిస్కో బుడ్డి 12)
తారాజువ్వలు (100) 250 350
భూ చక్రాలు (10) 100 180
టపాకాయలు (25) 25 40
పేలుడు జువ్వ (100) 1,000 1,600
డిస్కో చిచ్చుబుడ్లు (12) 260 380
ఫ జిల్లాలో బాణసంచా ధరల మోత
ఫ 20 నుంచి 40 శాతం వరకూ
పెరుగుదల
ఫ పండగ ముందే దెబ్బతీసిన ‘రాయవరం’ ఘటన
ఫ దుకాణాల అనుమతులకు రూ.వేలల్లో లంచాలు
వసూళ్ల పర్వం
నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) కీలక శాఖలకు కాసుల పంట పండిస్తోంది. దుకాణాల ఏర్పాటుకు చెల్లించే ఫీజు కాకుండా పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, స్థానిక పంచాయతీలు, మున్సిపాలిటీల ఇలా అన్ని శాఖలకు కలిపి దుకాణానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ వసూలు చేస్తున్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది మామూళ్ల సొమ్ములు రెట్టింపయ్యాయని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. సొమ్ము ఇవ్వకుంటే ఏదో వంకతో దుకాణాలకు అనుమతులు మంజూరు చేయకపోవడంతో అధికారులు అడిగినంతా ఇస్తున్నారు. ఇటీవల అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసిన సమయంలో పట్టుబడిన సుమారు రూ.5.80 లక్షలు బాణసంచా దుకాణాల అనుమతుల కోసం వసూలు చేసిన సొమ్ములేననే విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.