
ప్రజారోగ్యాన్ని పట్టించుకోని కూటమి సర్కారు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
అంబాజీపేట: ప్రజారోగ్యాన్ని కూటమి సర్కారు పట్టించుకోవడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. అంబాజీపేటలో ఫుడ్ పాయిజన్‌కు గురైన 13 మంది బాధితులను ఆదివారం జగ్గిరెడ్డి, పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అటు నాయకులు, ఇటు అధికారులకు ప్రజారోగ్యం పట్ల ఏ మాత్రం శ్రద్ధ లేదని విమర్శించారు. ఇటీవల రాయవరంలో బాణసంచా పేలుడు, అమలాపురం, అంబాజీపేటలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు, పాడేరులోని ఎస్సీ బాలికల వసతి గృహంలో నీటి కాలుష్యం తదితర ఘటనలు వెలుగు చూశాయన్నారు. నిబంధనలకు అనుగుణంగా అధికారులు హోటళ్లను, ఇతర వ్యాపార సంస్థలను తనిఖీ చేయకపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు. ఇందుకు ప్రధానంగా మంత్రులకు వారి శాఖలపై సరైన అవగాహన, పట్టు లేకపోవడం వల్ల అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫుడ్ పాయిజన్ బాధితులంతా పేదలు కావడం, కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడంతో కార్పొరేట్ వైద్యానికి దూరమయ్యారన్నారు. ఇలాంటి ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరగకుండా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ముందుగా దాడులు నిర్వహించి, వ్యాపారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలన్నారు. నాణయతా ప్రమాణాలు పాటించని వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకుడు పీకే రావు, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు దొమ్మేటి సత్యమోహన్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి హరి, ఎంపీటీసీ మట్టా పార్వతి, కొర్లపాటి కోటబాబు, కుసుమే శ్రీను, గోసంగి కుమారస్వామి, ఉందుర్తి నాగబాబు, మట్టా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.