కార్తికం.. భక్త్యుత్సవం | - | Sakshi
Sakshi News home page

కార్తికం.. భక్త్యుత్సవం

Oct 20 2025 7:28 AM | Updated on Oct 20 2025 7:28 AM

కార్తికం.. భక్త్యుత్సవం

కార్తికం.. భక్త్యుత్సవం

అన్నవరం: హరిహరాదులకు ప్రీతికరమైన కార్తిక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. సామర్లకోటలోని పంచారామ క్షేత్రం శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం పాదగయ క్షేత్రంతో పాటు హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్న అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్తిక మాసోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆశ్వయుజ అమావాస్య సోమవారం సాయంత్రం ప్రారంభమై మంగళవారం సాయంత్రానికి ముగుస్తుంది. అయితే, శుద్ధ పాడ్యమి తిథి ఉదయం వేళకు ఉండటాన్ని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి పంచాంగం ప్రకారం బుధవారమే కార్తిక మాసం ఆరంభమవుతుంది. అయితే, కార్తిక శుద్ధ పాడ్యమి తిధి మంగళవారం సాయంత్రమే వస్తున్నందున ఆలయాల్లో మాత్రం ఆ రోజు రాత్రి ఆకాశ దీపం ఏర్పాటుతో కార్తిక మాసోత్సవాలు ప్రారంభించనున్నారు. అన్నవరం దేవస్థానంలో అర్చకులు మంగళవారం రాత్రి ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం ఏర్పాటు చేయడం ద్వారా కార్తిక మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. కార్తిక అమావాస్య అయిన నవంబర్‌ 20వ తేదీ వరకూ ప్రతి రోజూ ఆకాశ దీపం ఏర్పాటు చేస్తామని ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం తెలిపారు.

ఇవీ ఏర్పాట్లు

కార్తిక మాసంలో సత్యదేవుని సన్నిధికి లక్షలాదిగా భక్తులు తరలి రానున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫ శని, ఆది, సోమవారాలతో పాటు, దశమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తిక పౌర్ణమి తదితర 16 పర్వదినాల్లో వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తెల్లవారుజామున ఒంటి గంట నుంచే సత్యదేవుని వ్రతాలు, 2 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

ఫ పౌర్ణమి, ఏకాదశి, పర్వదినాల్లో పశ్చిమ రాజగోపురం వద్ద రోప్‌ పార్టీ ఏర్పాటు చేసి, అధిక సంఖ్యలో వచ్చే భక్తులను బృందాల వారీగా దర్శనానికి అనుమతిస్తారు.

ఫ పర్వదినాల్లో ముందు రోజు రాత్రే వ్రతాల టికెట్లు ఇస్తారు. దీనికి గాను ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. స్వామివారి దర్శనం టికెట్లు, ప్రసాద విక్రయాలకు కూడా అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు.

ఫ కార్తిక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి) సందర్భంగా నవంబర్‌ రెండో తేదీ రాత్రి 6.30 గంటల నుంచి పంపా సరోవరంలో సత్యదేవుని తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.

ఫ కార్తిక పౌర్ణమి సందర్భంగా నవంబర్‌ ఐదో తేదీ ఉదయం సత్యదేవుని గిరి ప్రదక్షిణ పల్లకీ మీద లాంఛనంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు సత్యరథంతో గిరి ప్రదక్షిణ ఘనంగా ప్రారంభించి, సాయంత్రం ఆరున్నర గంటలకు ముగిస్తారు. అదే రోజు సాయంత్రం 5.45 గంటలకు పంపా జలాశయం వద్ద పంపా హారతులు, రాత్రి 7 గంటలకు తొలి పావంచా వద్ద జ్వాలాతోరణం నిర్వహిస్తారు.

ఫ కార్తికం నెల రోజులూ చిన్న కార్లు, ఆటోలు మినహా మరే ఇతర వాహనాలను కొండ మీదకు అనుమతించరు. పెద్ద వాహనాలను భక్తులు కళాశాల మైదానంలో నిలిపివేసి, దేవస్థానం బస్సులు, ఆటోల ద్వారా కొండ మీదకు చేరుకోవాలి.

ఫ కొండ మీదకు వచ్చే చిన్న కార్లను సత్యగిరి రోడ్డు పక్కన, సత్రాల ఆవరణలో నిలుపు చేస్తారు. దీనికోసం పార్కింగ్‌ స్థలాన్ని ప్రత్యేకంగా విశాలంగా రూపొందిస్తున్నారు. సుమారు 4 వేల కార్ల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువకు వెళ్లే వాహనాలను ఆదిశంకర మార్గ్‌ ద్వారా పంపిస్తారు.

ఫ రత్నగిరిపై 2 వేల మంది సేద తీరేందుకు వీలుగా డార్మెట్రీ, విష్ణు సదన్‌లో 36 హాళ్లు ఉన్నాయి. సీఆర్‌ఓ కార్యాలయం వద్ద నిర్మించిన డార్మెట్రీలో లాకర్లతో పాటు అన్ని సదుపాయాలూ కల్పించారు. ఈఓ కార్యాలయం దిగువన ఉన్న మెయిన్‌ క్యాంటీన్‌ను కూడా డార్మెట్రీగా మార్చనున్నారు.

ఫ విద్యుత్‌ సరఫరా 24 గంటలూ నిరాటంకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఫ దేవస్థానం, కొండ దిగువన మెయిన్‌ రోడ్డు, రైల్వే స్టేషన్‌ రోడ్డులో పారిశుధ్యం మెరుగు పడేలా అదనపు సిబ్బందిని నియమించారు.

ఫ భక్తుల కోసం రత్నగిరి పైన, దిగువన 457 టాయిలెట్లు ఉన్నాయి. గిరి ప్రదక్షిణ రోడ్డులో 24 టాయిలెట్లు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ రోడ్డులో ఈసారి విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయనున్నారు.

ఫ కార్తిక మాసంలో అన్నదానానికి బదులు సర్కులర్‌ మండపం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తులకు పులిహోర, దద్ధోజనం.. చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తారు. అన్నదాన పథకంలో సెక్యూరిటీ సిబ్బందికి, కళాకారులకు మాత్రమే భోజన సౌకర్యం ఉంటుంది.

ఫ పశ్చిమ రాజగోపురం వద్ద లారెస్‌ ఫార్మాస్యూటికల్స్‌ (విశాఖపట్నం) నిర్మించిన విశ్రాంతి షెడ్డులో సుమారు 5 వేల మంది భక్తులు సేద తీరే అవకాశం ఉంది. ఈ షెడ్డులోనే భక్తులకు వ్రతాలు, దర్శనం, ప్రసాదాల టికెట్ల విక్రయాలకు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement