నారావారి సారా ఏరులై పారుతోంది
● నకిలీ మద్యంతో తాళిబొట్లు
తెంచుతున్న చంద్రబాబు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి
రావులపాలెం: రాష్ట్రంలో నారావారి సారా ఏరులై పారుతోందని, ఆ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. గురువారం రావులపాలెం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నేతలతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, చింతలపాటి శ్రీనివాసరాజు, పాటి శివకుమార్, చెల్లుబోయిన శ్రీనివాసరావు హాజరయ్యారు. నకిలీ మద్యం బాటిళ్లు, కల్తీ మద్యంపై వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్‌లను వారు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల తాళిబొట్లు తెంచేలా చంద్రబాబు నకిలీ మద్యం విక్రయాలు సాగిస్తున్నారని దుయ్యబట్టారు. కొత్తపేట నియోజకవర్గంలో మద్యం దుకాణంలో రూ.190కు దొరికే మద్యం, బండారు వారి బెల్ట్ షాపులో రూ. 230కు విక్రయిస్తున్నారని విమర్శించారు. అలాగే నియోజకవర్గంలో యూరియా దొరకదు కానీ, నకిలీ మద్యం మాత్రం పుష్కలంగా లభ్యమవుతుందన్నారు. మద్యంలో స్థానిక కూటమి నాయకుడి అవినీతి గుర్రం పరుగెత్తుతుందని అన్నారు. నకిలీ మద్యంపై కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా కలసి వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నాయన్నారు. మద్యంపై లైవ్ డిటెక్టర్ టెస్ట్‌కు జోగి రమేష్ సిద్ధంగా ఉన్నారని, మరి చంద్రబాబు, లోకేష్ కూడా సిద్ధమా అని ప్రశ్నించారు. కొత్తపేట నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం ఎన్ని గ్రామాలకు స్వచ్ఛమైన నీరు ఇచ్చిందో తెలియదు గాని, ప్రతి గ్రామానికి చీఫ్ లిక్కర్ మాత్రం బాగా అందిస్తుందని వైఎస్సార్ ీసీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. ఇటువంటి పాలనపై స్థానిక ఎమ్మెల్యే సత్యానందరావు సిగ్గుపడాలని విమర్శించారు. ఎన్నికల ముందు కన్న తండ్రిలా పరిపాలిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు కసాయి తండ్రిలా మారారని దుయ్యబట్టారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, జెడ్పీటీసీ సభ్యులు గూడపాటి రమాదేవి, బోణం సాయిబాబు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ నాయకుడు కప్పల శ్రీధర్, ఆత్రేయపురం పార్టీ మండల కన్వీనర్ ముదునూరి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.


