వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం
ప్రభుత్వ విధానాలు ఎండగడదాం..
కొత్తపేట: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమం’ పేరిట ఈ నెల 28న నిరసన కార్యక్రమం చేపట్టిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి తెలిపారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిలో వాడపల్లిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గురువారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన రచ్చబండ సమావేశానికి జక్కంపూడి విజయలక్ష్మి, నియోజకవర్గ పరిశీలకుడు పాటి శివకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, దుర్మార్గ చర్యలపై ప్రజల పక్షాన ‘వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమం’ చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నట్టు తెలిపారు. సంపద సృష్టిస్తానని, సంక్షేమ పథకాలు అమలు చేస్తానని అధికారం చేపట్టిన చంద్రబాబు దానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. బ్రిటీష్ పాలకుల తరహాలోనే నేటి కూటమి పాలకులు ప్రజల ఆస్తులు, ప్రభుత్వ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా సాగుతున్నారన్నారు. పేద, సామాన్య వర్గాలకు అందుబాటులో ఉండేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొత్తగా 17 వైద్య కళాశాలలను తీసుకువస్తే, నేటి సీఎం చంద్రబాబు తన బినామీలకు ఒక్కో కళాశాలను కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా ప్రైవేటీకరణకు చర్యలు తీసుకున్నారన్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికే కోటి సంతకాల సేకరణకు జగన్ పిలుపునిచ్చారని అన్నారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్, అనారోగ్యానికి గురైన పేద, మధ్యతరగతి ప్రజలు ఉచితంగా ఉన్నత వైద్యం పొండానికి ఆరోగ్యశ్రీ అమలు చేయగా దేశ, విదేశాలు ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలలను నాడు – నేడు పేరుతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మార్చారన్నారు. పేద విద్యార్థుల కోసం 17 వైద్య కళాశాలలను తీసుకు వచ్చారన్నారు. ఆ తండ్రీ, కొడుకుల ఆశయాలను, ప్రజాస్వామ్యాన్ని నేటి పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం రైతులు, దాదాపు అన్ని శాఖల ఉద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారన్నారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తున్న ‘సాక్షి’ గొంతునొక్కుతూ దాడులు చేయిస్తున్నారని అన్నారు. అనంతరం ప్రజా ఉద్యమం పోస్టర్లను జగ్గిరెడ్డి, విజయలక్ష్మి తదితరులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు, ఎంపీపీలు కుండ అన్నపూర్ణ, మార్గన గంగాధరరావు, తోరాటి లక్ష్మణరావు, జెడ్పీటీసీ సభ్యుడు బోనం సాయిబాబు, రాష్ట్ర పార్టీ ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర బూత్ విభాగం కార్యదర్శి సాకా ప్రసన్నకుమార్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు కనుమూరి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
అమలాపురం టౌన్: ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని విద్యార్థులు ఎండగట్టాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మిండగుదిటి శిరీష్ పిలుపునిచ్చారు. అమలాపురంలోని పలు ప్రైవేట్ కళాశాలల్లో శిరీష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి గురువారం శ్రీకారం చుట్టారు. శిరీష్‌తో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి లోవరాజు, జిల్లా కార్యదర్శి సుజిత్ తదితరులు అమలాపురంలోని పలు ప్రైవేట్ కళాశాలలకు వెళ్లి విద్యార్థుల నుంచి సంతకాలను సేకరించారు. శిరీష్ మాట్లాడుతూ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం వల్ల భావితరాలకు జరిగే నష్టాలను వివరించారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని అవగాహన కల్పించారు.
ఫ 28న నియోజకవర్గ కేంద్రాల్లో
నిరసన ర్యాలీలు
ఫ వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం


