నీట ముంచేలా.. | - | Sakshi
Sakshi News home page

నీట ముంచేలా..

Oct 24 2025 2:40 AM | Updated on Oct 24 2025 2:40 AM

నీట మ

నీట ముంచేలా..

సాక్షి, అమలాపురం: చినుకు వణుకు పుట్టిస్తోంది.. అన్నదాతను నిండా ముంచుతోంది.. ఖరీఫ్‌ ఆరంభంలో వానలు లేక ఇబ్బంది పడిన రైతులకు సాగు చివరిలో కురుస్తున్న వాన కలవరానికి గురిచేస్తుంది. నైరుతిలో ముఖం చాటేసిన వర్షం, ఈశాన్య రుతుపవనాల్లో ప్రభావం చూపుతుండటంతో పుడమిపుత్రులకు శోకాన్ని మిగుల్చుతోంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో వరుసగా మూడో రోజు కూడా వర్షం కురిసింది. గురువారం తెల్లవారు జాము నుంచి రాత్రి వరకూ ఏకధాటిగా వర్షం పడడంతో జనజీవనం స్తంభించింది. అప్పుడప్పుడు భారీగా, తరువాత చినుకులు పడుతూ... తిరిగి భారీ వర్షం కురుస్తూనే ఉంది. జిల్లాలో ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ సగటున 64.1 మిల్లీమీటర్ల వర్షం పడింది. కాట్రేనికోన మండలంలో అత్యధికంగా 112 మిల్లీమీటర్లు, మండపేట మండలంలో అత్యల్పంగా 9.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ 43 మిల్లీమీటర్లు కురవగా, తరువాత 21.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షానికి తోడు ఈదురు గాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు, రోడ్డు వెంబడి ఉన్న వృక్షాలు నేలకొరిగాయి. అత్యధికంగా వర్షం కురిసిన కాట్రేనికోన మండలం వేట్లపాలెంలో విద్యుత్‌ స్తంభం నేలకొరిగింది. ఈదురుగాలుల కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షంతో వ్యాపారాలు లేక చిరు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. జిల్లా కేంద్రం అమలాపురంతో పాటు కొత్తపేట, రావులపాలెంలో రోడ్లపై నీరు తిష్ట వేసింది. అమలాపురం హౌసింగ్‌ బోర్డు కాలనీలో రెండు అడుగుల మేర నీరు నిలిచిపోయింది. రావులపాలెం బస్టాండ్‌ జల దిగ్బంధనంలో చిక్కుకుంది. దీనితో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. లోతట్టు కాలనీలు ముంపు బారిన పడ్డాయి. ఇళ్ల మధ్య వర్షం నీరు చేరి జనం పాట్లు పడుతున్నారు. రాత్రి దాటిన తరువాత కూడా వర్షం పడడంతో మరింత ముంపునకు గురవుతాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతుల్లో కల‘వరి’పాట్లు

గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఏకధాటిగా పడిన వర్షానికి తోడు ఈదురుగాలులతో ఖరీఫ్‌ వరి చేలు నేలనంటుతున్నాయి. కె.గంగవరం, రామచంద్రపురం, కొత్తపేట, పి.గన్నవరం, అమలాపురం, అంబాజీపేట మండలాల్లో వరి చేలు ఒరిగిపోయాయి. జిల్లాలో 1.53 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిన విషయం తెలిసిందే. సాగు ఆరంభంలో నైరుతి రుతు పవనాలు ముఖం చాటేయడంతో శివారు రైతులు సాగునీరందక ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. కీలకమైన సమయంలో వర్షాలు పడక రైతులు పూర్తిగా పంట కాలువలు, మోటార్ల నీటిపై ఆధారపడ్డారు. తీరా పంట చేలు పాలుపోసుకుని గింజ గట్టిపడుతున్న దశలో కురుస్తున్న వర్షాలకు చేలు నేలనంటడంతో అన్నదాతల్లో గుబులు రేపుతోంది. దీనికితోడు ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అల్లవరం, మలికిపురం, మామిడికుదురు మండల్లాలోని తీర ప్రాంతాల్లో వరి చేలు ముంపు బారిన పడుతున్నాయి. వర్షాలు మరో రెండు రోజులు ఇదే విధంగా కురిస్తే చేలు ముంపులో చిక్కుకుని నష్టపోతామని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం వర్షంతో చేలకు తక్షణం కలిగే నష్టం లేకున్నా ముంపు నీరు దిగేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖాధికారులు సూచిస్తున్నారు.

కాట్రేనికోన మండలం వేట్లపాలెంలో రోడ్డుపై ఒరిగిన విద్యుత్‌ స్తంభం

కందికుప్ప సొసైటీ కార్యాలయం వద్ద పడిపోయిన చెట్లు

అమలాపురం హౌసింగ్‌ బోర్డు కాలనీలోకి చేరిన ముంపునీరు

ఫ అన్నదాత గుండెల్లో ‘అల్పపీడనం’

ఫ జిల్లాలో మూడో రోజూ ఆగని వర్షం

ఫ 1.53 లక్షల ఎకరాల్లో వరి సాగు

ఫ నేలకొరుగుతున్న వరి పంట

ఫ లోతట్టు ప్రాంతాల్లోకి

చేరిన ముంపునీరు

జిల్లాలో వర్షపాతం ఇలా..

జిల్లాలో ఉప్పలగుప్తంలో 110 మిల్లీమీటర్లు, కొత్తపేటలో 97.8, అయినవిల్లిలో 91, ఐ.పోలవరంలో 92.4, ముమ్మిడివరంలో 84, మలికిపురం, కె.గంగవరంలో 79.2, రావులపాలెంలో 77, అమలాపురంలో 74.6, కపిలేశ్వరపురంలో 74.4, ఆలమూరు, సఖినేటిపల్లిలో 62.6, అంబాజీపేటలో 51, పి.గన్నవరంలో 50, ఆత్రేయపురంలో 44.6, రాజోలులో 44.4, అల్లవరంలో 40, మామిడికుదురులో 37.2, రాయవరంలో 20.4, రామచంద్రపురంలో 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నీట ముంచేలా..1
1/3

నీట ముంచేలా..

నీట ముంచేలా..2
2/3

నీట ముంచేలా..

నీట ముంచేలా..3
3/3

నీట ముంచేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement