సాహితీవేత్త ‘పోచినపెద్ది’ మృతి
అమలాపురం టౌన్: అమలాపురం పట్టణంలోని మాధవనగర్‌కు చెందిన ప్రముఖ సాహితీవేత్త, కవి, విశ్రాంత ప్రిన్సిపాల్ పోచినపెద్ది కామ సత్య నారాయణ (88) వృద్ధాప్యంతో తన ఇంట్లో గురువారం ఉదయం మృతి చెందారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా 1996లో ఉద్యోగ విరమణ పొందిన పోచినపెద్ది పలు పుస్తకాలు, స్తోత్రాలు రచించారు. అనేక సాహితీ సమావేశాలకు ముఖ్య వక్తగా వ్యవహరించారు. తెలుగు అధ్యాపకులకు పరిజ్ఞాన నిపుణులుగా ఐదు దశాబ్దాలుగా విశిష్టమైన సేవలు అందించారు. ఈయన శివానందలహరి, సౌందర్య లహరి వంటి పుస్తకాలతో పాటు శివ మహిమ్నా స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబం వంటి స్తోత్రాలను రచించి వాటి తాత్పర్యాలు సరళంగా అందించి పాఠకుల మన్ననలు పొందారు. పోచినపెద్దికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన మృతి యావత్ సాహితీ లోకానికి తీరని లోటని అమలాపురానికి చెందిన వీజీఎస్ ప్రచురణ సంస్థ అధినేతలు శిరం రామారావు, నారాయణరావు అన్నారు. సాహితీ అభిమానులు భమిడిపాటి నరసింహశాస్త్రి, వేగిశ్న సుబ్బరాజు, పేరి లక్ష్మీనరసింహం, పుత్సా కృష్ణకామేశ్వర్ తదితరులు సంతాపం తెలిపారు. శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, కోనసీమ రచయితల సంఘం అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ తదితరులు పోచినపెద్ది మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బాణసంచా బాధితులకు
రూ.కోటి పరిహారం ఇవ్వాలి
అల్లవరం: రాయవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం ప్రకటించి కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకొందని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యురాలు, మాజీ ఎంపీ చింతా అనురాధ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి అనాఽథలుగా మారిన బాధితులు ఒక్కొక్కరికీ రూ. కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. బాణసంచా అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది కూలీలు దుర్మరణం పాలైనా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్త్తోందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాణసంచా తయారీ కేంద్రాలు, గోదాముల్లో నిబంధనలు పాటించేలా చూడాలని సూచించారు.
డైట్‌లో అధ్యాపక పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో సీనియర్ అధ్యాపక, అధ్యాపక ఖాళీలను డెప్యూటేషన్ ఆన్ ఫారిన్ స్కేల్ టర్‌మ్స్ అండ్ కండిషన్స్(ఎఫ్‌ఎస్‌టీసీ)పై భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రిన్సిపాల్ ఆర్‌జేడీ రాజు గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ హైస్కూళ్లలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు దీనికి అర్హులన్నారు. సీనియర్ లెక్చరర్ తెలుగు–1, ఇంగిషు–1, మ్యాథ్స్–1, ఫైన్ ఆర్ట్స్–2 చొప్పున ఖాళీలున్నాయని వివరించారు. దరఖాస్తును ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా ఈ నెల 29వ తేదీ లోపు తనకు సమర్పించాలన్నారు. దరఖాస్తు, ఖాళీ వివరాలు, నియమ నిబంధనలు, ఇతర వివరాలకు డైట్ లెక్చరర్ ఎంఎన్‌వీఎస్‌ఆర్‌వీ రాజేష్‌ను 94906 48110 నంబరులో సంప్రదించాలన్నారు. దరఖాస్తులను డైట్ ఫ్యాకల్టీ వేకెన్సీస్ లింక్ https://forms.gle/oJZMnbkEtNynPLxi9 ద్వారా ఆన్‌లైన్‌లో పంపించాలని రాజు సూచించారు.
అలరించిన జ్యోతిర్లింగార్చన
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి వారి ఆలయంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగార్చన ఎంతగానో ఆకట్టుకుంది. కార్తిక మాసం సందర్భంగా ఆలయంలో లక్షపత్రి పూజలు చేసుకున్న వారి ద్వారా ఆలయ దీపారాధన సంఘం ఆధ్వర్యాన జ్యోతిర్లింగార్చన నిర్వహిస్తూంటారు. లక్షపత్రి పూజలు చేసుకునే భక్తులు దేవస్థానానికి రూ.2,500 చెల్లించాలి. లక్షపత్రి పూజలు చేసిన భక్తులు వెలిగించగా మిగిలిన దీపాలను వెలిగించడానికి ఆలయానికి వచ్చిన ఇతర భక్తులు పోటీ పడ్డారు. కార్తిక మాసాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు ఆలయంలో దీపాలు వెలిగించారు.
సాహితీవేత్త ‘పోచినపెద్ది’ మృతి


