చోరీ కేసులో నిందితురాలి అరెస్ట్
అమలాపురం టౌన్: స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్‌లో ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్ నుంచి బంగారు నగలు, కొంత నగదు కాజేసిన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం అప్పారావు పేటకు చెందిన జడ్డు ముత్యవతిని పట్టణ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆమె నుంచి 66.270 గ్రాముల బంగారు నగలు రికవరీ చేసినట్లు పట్టణ ఎస్సై ఎన్‌ఆర్ కిషోర్‌బాబు తెలిపారు. ఈ నెల 4న అమలాపురం ఆర్టీసీ బస్ స్టేషన్‌లో ముమ్మిడివరానికి చెందిన ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఉంటున్న వెలిగంటి లీలావతి హ్యాండ్ బ్యాగ్‌ను ముత్యవతి చాకచక్యంగా దొంగిలించిందని ఎస్సై అన్నారు. బ్యాగ్‌లో దాదాపు రూ.5.50 లక్షల విలువైన బంగారు నగలు మాయమయ్యాయి. తన హ్యాండ్ బ్యాగ్‌ను, అందులోని బంగారు నగలు, కొంత నగదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించారని బాధితురాలు లీలావతి అదే రోజు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ పర్యవేక్షణలో లోతైన దర్యాప్తు చేశారు. నిందితురాలు ముత్యవతిని అరెస్ట్ చేసి బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై చెప్పారు. ఆమెను అమలాపురం ఏజేఎఫ్‌సీఎం కోర్టులో గురువారం హాజరుపరిచామన్నారు.


