వైభవంగా తిరుమంజన సేవ
మామిడికుదురు: దోషాల పరిహారార్థం చేపట్టిన పవిత్రోత్సవాలు అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి క్షేత్రంలో రెండో రోజు గురువారం ఘనంగా జరిగాయి. చతుస్థానార్చనలతో ప్రారంభమైన పవిత్రోత్సవాల్లో అగ్ని ప్రతిష్ఠాపన, పవిత్రారోహణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. బాల బాలాజీ స్వామితో పాటు పద్మావతీదేవి, ఆండాళ్‌తాయార్ అమ్మవార్లకు 27 కలశాలతో పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, 11 రకాల పండ్ల రసాలు, ఉద్గ జలాలతో నిర్వహించిన స్నపన తిరుమంజన సేవ ఆద్యంతం ఆకట్టుకుంది. వేద మంత్రాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఈ కార్యక్రమం సాగింది. వీటితో పాటు ప్రాయశ్చిత హోమం, నివేదన, తీర్థ ప్రసాద గోష్ఠి, చతుస్థానార్చనలు, నివేదన, మంగళా శాసనం పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో శ్రీమాన్ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి శిష్య బృందం, గుడివాడకు చెందిన చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను అర్చక స్వాములు నిర్వహించారు.


