రత్నగిరిపై భక్తజన ప్రవాహం
● కొనసాగుతున్న రద్దీ
● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది
● రూ.50 లక్షల ఆదాయం
అన్నవరం: రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. సత్యదేవుని దర్శించేందుకు వేలాదిగా భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారిని సుమారు 50 వేల మంది దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు ఐదు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు, రూ.200 టికెట్టుతో దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. నిత్యాన్నదాన పథకం వద్ద భక్తులకు పులిహోర, దద్ధోజనం పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఏర్పాట్లను పరిశీలించారు.
నేడు కూడా కిటకిట!
కార్తిక మాసంలో తొలి సోమవారం కావడంతో సత్యదేవుని ఆలయానికి నేడు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేకువజామున ఒంటి గంట నుంచే వ్రతాల నిర్వహణకు, దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. సుమారు 60 వేల మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు వేలకు పైగా వ్రతాలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
భక్తులకు తీరని కష్టాలు
● కార్తిక మాసంలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో అధికారుల వైఫల్యం కనిపిస్తోంది.
● పడమటి రాజగోపురం లోపల ఉన్న క్యూల నుంచి, అక్కడ నిర్మించిన కంపార్ట్‌మెంట్లలోకి భక్తులను పంపిస్తున్నారు. అక్కడ భక్తులకు మంచినీరు అందించడం లేదు. కేవలం క్యూలలోనే మంచినీరు సరఫరా చేస్తున్నారు. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
● వ్రత మండపాలకు ఎలా వెళ్లాలి, రూ.300, రూ.వెయ్యి, రూ.1,500 వ్రత మండపాలకు ఎలా వెళ్లాలో తెలిపే సైన్ బోర్డులు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. అలాగే, ప్రసాదం కౌంటర్లు తెలిపే బోర్డులు కూడా లేవు. వీటిని తూర్పు, పశ్చిమ రాజగోపురం వద్ద ఏర్పాటు చేయాలి. దర్శనం టికెట్లు, టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయో తెలిపే బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి.
● డిజిటల్ చెల్లింపులు చేయవచ్చనే ఉద్దేశంతో చాలామంది భక్తులు నగదు తక్కువ తెచ్చుకుంటున్నారు. కానీ, రత్నగిరిపై సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేక, డిజిటల్ చెల్లింపులు జరగక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై గతంలో ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. దీంతో, గత ఏప్రిల్‌లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ దేవస్థానానికి వచ్చినప్పుడు భక్తుల సౌకర్యార్థం ఉచిత వైఫై సదుపాయం కల్పించారు. ఇప్పుడు మళ్లీ పూర్వ స్థితికి వచ్చేసింది.
● దేవస్థానంలోని ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్ ఏటీఎంలలో చాలినంత నగదు ఉండక భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
● భక్తులు రథం పాత్‌లోకి రాకుండా తూర్పు రాజగోపురం దిగువన ఉన్న మెట్ల ద్వారా సర్కులర్ మండపం వైపు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సన్ డయల్ ఎదురుగా బారికేడ్లు కట్టి, భక్తులు వెనక్కి రాకుండా చేశారు.


