ఐఈఆర్పీలకు నేడు సర్టిఫికెట్ వెరిఫికేషన్
రాయవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐఈఆర్పీలకు సోమవారం ఉదయం సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ జిల్లా కో–ఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ ఆదివారం తెలిపారు. కాకినాడలోని సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉదయం పది గంటల నుంచి కోనసీమ, ఏఎస్‌ఆర్ జిల్లాల్లో పనిచేస్తున్న ఐఈఆర్పీలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు కాకినాడ జిల్లా విద్యా శాఖాధికారి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఐఈఆర్పీలు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో భాగంగా గెజిటెడ్ అటెస్టేషన్‌తో ఉన్న మూడు సెట్ల జెరాక్స్ కాపీలు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఆయా జిల్లాల ఐఈఆర్పీలు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని, ఎవరికీ మినహాయింపులు లేవని స్పష్టం చేశారు. చెక్ లిస్ట్ రెండు కాపీలు తీసుకురావాలని తెలిపారు.
అన్న ప్రసాద
పథకానికి విరాళాలు
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో నిత్య అన్న ప్రసాద పథకానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. ఆదివారం రాజమహేంద్రవరానికి చెందిన భూపతిరాజు సాయిశరత్‌వర్మ, వారి కుటుంబ సభ్యులు రూ.36,500, రామచంద్రపురం గణపవరం గ్రామానికి చెందిన కొండేటి వెంకటరత్నం, వారి కుటుంబ సభ్యులు రూ.30,116 విరాళాలు సమర్పించారు. దాతలకు దేవదాయ–ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందజేశారు.
విఘ్నేశ్వరాలయానికి
భక్తుల తాకిడి
అయినవిల్లి: ప్రసిద్ధి చెందిన అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారుజామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ తదితర విశేష పూజలు నిర్వహించారు. స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 213 మంది పాల్గొన్నారు. 15 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఐదుగురికి తులాభారం వేశారు. ఒకరికి నామకరణ, నలుగురికి అన్నప్రాశన జరిపారు. లక్ష్మీగణపతి హోమంలో 19 జంటలు పాల్గొన్నాయి. 61 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 3,620 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్కరోజు స్వామివారికి వివిధ రకాలుగా రూ.3,57,654 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ, ఏసీ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
విద్యుత్ యంత్రాంగం సిద్ధం
అమలాపురం రూరల్: మోంథా పెను తుపాను విపత్తును ఎదుర్కొనేందుకు కోనసీమ విద్యుత్ అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన సిద్ధంగా ఉన్నారని ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ బి.రాజే శ్వరి ఆదివారం తెలిపారు. తుపాను ప్రభావం విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లపై అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుపాను వల్ల విద్యుత్ లైన్లు కూలిపోయి, సరఫరాకు ఆటంకం కలగవచ్చన్నారు. పెను గాలుల తాకిడికి పడిన తీగలు, స్తంభాలను ప్రజలు గమనించిన వెంటనే సమీపంలోని విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని కోరారు. తడిసిన స్తంభాలు, తీగల వద్ద ఉన్న చెట్ల కొమ్మలు, తడిసిన స్విచ్ బోర్డులు ప్రజలు తాకరాదని హెచ్చరించారు. విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉంటారని, సమీపంలోని ఆఫీసు సిబ్బందికి, ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేసి తమ అసౌకర్యాన్ని తెలపాలన్నారు. సబ్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఏపీఈపీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1912, జిల్లా స్థాయి కంట్రోల్ నంబర్ 94409 04477కు సమస్యలను తెలపాలన్నారు.
ఐఈఆర్పీలకు నేడు సర్టిఫికెట్ వెరిఫికేషన్


