వామ్మోంథా | - | Sakshi
Sakshi News home page

వామ్మోంథా

Oct 27 2025 8:30 AM | Updated on Oct 27 2025 8:30 AM

వామ్మ

వామ్మోంథా

సాక్షి, అమలాపురం: అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాల నుంచి జిల్లావాసులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ కాస్తూ.. వాతావరణం అహ్లాదంగా ఉంది. కానీ.. ఇది తుపానుకు ముందు ప్రశాంతత అనే భయం జిల్లావాసులను వెంటాడుతోంది. మోంథా తుపాను తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ జిల్లావాసుల గుండెల్లో అలజడి రేగుతోంది. తీవ్ర తుపానుగా మారి కాకినాడ సమీపంలో తీరం దాటవచ్చనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో 1996 పెను తుపాను నాటి విషాదఛాయలను గుర్తు చేసుకుని వణికిపోతున్నారు.

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా, పెను తుపాను గా రూపాంతరం చెంది కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశముంది. వంద నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని, కనీసం 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తోందని అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో సోమ వారం నుంచి గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. సఖినేటిపల్లి మండలం అంతర్వేది నుంచి ఐ.పోలవరం మండలం భైరవపాలెం వరకూ జిల్లాలో 90 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. తుపాను నేపథ్యంలో సహాయ పునరావసం కల్పించేందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విజయరామరాజును జిల్లా ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లా యంత్రాంగం సిద్ధం

తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. తీరాన్ని ఆనుకుని ఏడు మండలాల్లో 34 ఆవాస ప్రాంతాలుండగా, సుమారు ఆరు వేల మంది జీవనం సాగిస్తున్నారు. భారీ గాలులు, అధిక వర్షంతో పాటు, సముద్ర అలలు ఎగిసిపడే ప్రమాదముంది. మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాల్లో తీరాన్ని ఆనుకుని అనకాపల్లి జిల్లాకు చెందిన వలస మత్స్యకారులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. తుపాను తొలి ప్రభావం వీరిపైనే ఉంటుంది. 1996 తుపాను వల్ల కోనసీమకు కలిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మత్స్యకార గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

ముందస్తు చర్యలు

ఇప్పటికే వేటకు వెళ్లిన జిల్లా పరిధిలోని మత్స్యకారులను జిల్లా యంత్రాంగం వెనక్కు రప్పిస్తోంది. తీరంలో పూరిపాకల్లో ఉన్న వారిని తుపాను పునారావస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం ఒకటి ఉండగా, మరో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం చేరుకోనుంది. పర్యాటక బీచ్‌ను మూసివేశారు. 27, 28, 29 తేదీల్లో విద్యా సంస్థలకు సెలవులిచ్చారు. వర్షం తీవ్రతను బట్టి 27వ తేదీ కూడా విద్యాసంస్థలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తీర ప్రాంత మండలాలను కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌, డీఆర్వో కె.మాధవి సందర్శించారు. తుపాను షెలర్టు, వాటి వద్ద చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

రైతుల్లో అలజడి

తుపాను వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే ప్రకటన ఖరీఫ్‌ వరి రైతుల్లో అలజడి రేపుతోంది. అల్పపీడన ప్రభావం వల్ల కురిసిన వర్షాలకు జిల్లాలో సుమారు 16,815 ఎకరాల్లో వరిచేలు నీట మునిగి, నేలనంటిన విషయం తెలిసిందే. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే పంటలపై ఆశలు వదులు కోవాల్సిందేనని భయపడుతున్నారు.

సోమవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

తుపాను పేరు వింటేనే కోనసీమ వాసుల్లో వణుకు పుడుతోంది. సుమారు మూడు దశాబ్దాల క్రితం 1996 నవంబర్‌ ఆరున ఓ పెను తుపాను కోనసీమ గుండెకు చేసిన.. మానని గాయమది. మృత్యువు చేయి చాచినట్టుగా భీకర ఈదురు గాలులు.. తాటిచెట్లను దాటి ఎగసిపడిన రాకాసి అలలు.. ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయిన దయనీయ దృశ్యాలు.. చెట్టూ.. పుట్టా.. ఇల్లూ.. వాకిలీ.. మనుషులనే కాదు.. పశుపక్ష్యాదులనూ నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేసిన కాళరాత్రి అది. ఉమ్మడి జిల్లాను తాకనున్న తాజా పెను తుపాను ‘మోంథా’ తీవ్రతను తలచుకుని.. అప్పటి విషాద జ్ఞాపకాలు కోనసీమ వాసులను కలవరపెడుతున్నాయి. అప్పట్లో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాలను గుణపాఠంగా తీసుకుని.. ప్రస్తుత జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలన్న సూచనలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

కలవరపెడుతున్న పెను తుపాను

జిల్లా యంత్రాంగం అప్రమత్తం

కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం

90 నుంచి 110 కిలోమీటర్ల

వేగంతో గాలులు

20 సెంటీమీటర్ల వర్షపాతం

నమోదు కావచ్చని హెచ్చరిక

తీరాన్ని ఖాళీ చేయిస్తున్న అధికారులు

వేట నుంచి సురక్షితంగా

చేరుకున్న మత్స్యకారులు

అందుబాటులో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం

జిల్లా ప్రత్యేకాధికారిగా విజయరామరాజు

అప్రమత్తంగా ఉన్నాం: కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

మోంథా తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ నెల 27, 28, 29 తేదీల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సముద్ర తీరం వెంబడి ఉన్న తుపాను పునరావాస కేంద్రాల వద్ద భోజన, వసతిని కల్పిస్తామన్నారు. తుపాను హెచ్చరికలకు అనుగుణంగా తరలించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. తీరంలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమిస్తున్నామని వెల్లడించారు. వీరు మైరెన్‌ పోలీసుల సమన్వయంతో పని చేస్తారన్నారు. జిల్లా కేంద్రం, డివిజన్‌, మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కేంద్రంలో 08856–293104 నంబర్‌లో సంప్రదించి, సహాయక చర్యలు పొందవచ్చన్నారు. ఏపీ ఈపీడీసీఎల్‌ ఇప్పటికే మూడు వేల విద్యుత్‌ స్తంభాలు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచిందని కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ తెలిపారు.

వణికిస్తున్న ‘ఉప్పెన’ జ్ఞాపకాలు

కోనసీమలో 1996 నవంబర్‌ ఆరున పెను తుపాను కోనసీమను చిన్నాభిన్నం చేసింది. ఇది కోనసీమకు చీకటి అధ్యాయం. సుమారు 215 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. 39 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తీరంలో అలలు ఎగసిపడి ఉప్పెన వచ్చింది. అప్పుడు కూడా తుపాను కాకినాడ–పుదిచ్చేరి యానాం మధ్య తీరం దాటింది. దీనివల్ల కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో తీరంలోని మత్స్యకార గ్రామాలు ధ్వంసమయ్యాయి. కాట్రేనికోన మండలం భైరవపాలెం, బలుసుతిప్ప ఆనవాళ్లు లేకుండా పోయాయి. సుమారు 2.25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నారు. నాటి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోనందున ఆస్తి, ప్రాణ నష్టం అధికంగా ఏర్పడింది. తుపాను ముందు హెచ్చరించడం కానీ, కనీస జాగ్రత్తలు కానీ తీసుకోలేదు. పునరావాస కేంద్రాలు ముందుగా ఏర్పాటు చేయలేదు. ఆ పెను తుపానులో అధికారికంగా 1,077 మంది మృత్యువాత పడ్డారు. 6.47 లక్షల ఇళ్లు ధ్వంసం కాగా, వీటిలో 40 వేల ఇళ్లు నేటమట్టమయ్యాయి. 5.97 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 20 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు నేల కూలడం, మొవ్వులు విరిగి చనిపోయాయి. వేలాది పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ తుపాను నుంచి కోలుకునేందుకు కోనసీమ వాసులకు దశాబ్ద కాలం పట్టిందంటే తుపాను తీవ్రత ఏ స్థాయిలో ఉందో అవగతమవుతుంది. తుపాను వచ్చి దగ్గర దగ్గరగా 30 ఏళ్లవుతున్నా బంగాళాఖాతంలో తుపాను హెచ్చరికలంటే ఈ ప్రాంతవాసులకు నాటి విషాదం కళ్ల ముందు కదలాడుతుంది.

వామ్మోంథా1
1/3

వామ్మోంథా

వామ్మోంథా2
2/3

వామ్మోంథా

వామ్మోంథా3
3/3

వామ్మోంథా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement