సొమ్ముసిల్లిపోయేలా.. | - | Sakshi
Sakshi News home page

సొమ్ముసిల్లిపోయేలా..

Oct 16 2025 5:05 AM | Updated on Oct 16 2025 5:07 AM

సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ధాన్యం కొనుగోలు లక్ష్యం, దిగుబడి అంచనాలు, అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాల్సిన కొనుగోలు కేంద్రాలపై ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం ఎప్పటిలాగే ధాన్యం సొమ్ములు 48 గంటల్లో రైతులు ఖాతాలో జమ చేస్తామని చెబుతుంది. గత రబీలో ఇలా చెప్పి కొందరు రైతులకు కొన్న రెండు నెలల వరకు సొమ్ములు జమ చేయకుండా ముప్పు తిప్పలు పెట్టిన విషయం తెలిసిందే.

జిల్లా పరిధిలో..

జిల్లాలోని తూర్పు డెల్టా పరిధిలో ఆలమూరు, రామచంద్రపురం, మధ్య డెల్టా పరిధిలో కొత్తపేట వ్యవసాయ సబ్‌ డివిజన్ల పరిధిలో వరిచేలు కొన్నిచోట్ల పొట్ట పోసుకుని దశలో, మరికొన్ని చోట్ల గింజగట్టిపడే దశలో ఉన్నాయి. మధ్య డెల్టాలోని అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం వ్యవసాయ సబ్‌ డివిజన్ల పరిధిలో శివారు ప్రాంతాల్లో మాత్రం గింజలు పాలు తోడుకునే దశలో ఉన్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ 1.63 లక్షల ఎకరాల్లో జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. కేవలం 1.56 లక్షల ఎకరాలలో మాత్రమే వరి సాగు జరిగింది.

221 కొనుగోలు కేంద్రాలు

జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 4.34 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగబడి వస్తుందని, రైతు అవసరాలకు పోను 3.88 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని జిల్లా యంత్రాంగం గుర్తించింది. జిల్లా వ్యాప్తంగా 221 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ కేంద్రాలకు 141 రైస్‌ మిల్లులను అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌. జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి సమీక్షలు జరిపారు.

గందరగోళం

● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా మారింది. గత ఏడాది ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు విషయంలో సైతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మిల్లుల వారీగా లక్ష్యాలకు అనుగుణంగా కొనుగోలు చేశారు. టార్గెట్లు దాటిన తర్వాత స్థానికంగా ఉన్న మిల్లులు కొనుగోలు చేయకపోవడంతో దూరంగా ఉన్న మిల్లులకు తోలుకోవాల్సి రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

● ఈ ఏడాది ఆరంభంలో రబీ ధాన్యం కొనుగోలు విషయంలోనూ ఇంతే. 5,86,616 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తోందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ తొలుత రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత మరో లక్ష మెట్రిక్‌ టన్నులు కొంటామన్నా రైతులు అప్పటికే అయినకాడికి అమ్ముకోవాల్సి వచ్చింది.

● బొండాల రకం (ఎంటీయూ–2636, టాటా రకం, ఒడిశా రకానికి చెందిన బొండాలు). ప్రభుత్వం అధికారికంగా కొనుగోలు చేయకున్నా మిల్లర్లు చేత కొనిపించేవారు. కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కొనేవారు లేక కనీస మద్దతు ధర కన్నా బస్తాకు రూ.225 చొప్పున తగ్గించి రూ.1,500లు చేసి కొనడంతో రైతులు నష్టపోయారు.

24 గంటలలో ఇస్తామని..

రబీ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో వారి ఖాతాలలో ధాన్యం సొమ్ములు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ రెండో దశ సొమ్ములు వేయడానికి రెండు నెలలు పట్టింది. గత రబీలో జూన్‌ 15 నాటికి జిల్లాలో 499.840 మెట్రిక్‌ టన్నులు గ్రేడ్‌– ఏ రకం, 2,68,875.520 మెట్రిక్‌ టన్నులు సాధారణ రకం ధాన్యం కొనుగోలు చేశారు. అప్పటికి మొత్తం ధాన్యం విలువ రూ.613.08 కోట్లు కాగా, రైతులకు రూ.364.43 కోట్లు మే 8వ తేదీ నాటికి చెల్లించారు. తరువాత జూన్‌ నెలాఖరు వరకు రూ.248.65 కోట్లు చెల్లించలేదు. దీనితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటు రోడ్డున పడి ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేయడం, రోడ్డు మీద ధాన్యం పోసి నిరసనలు జరపడం చేశారు. వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ధాన్యం సొమ్ములు ఇవ్వాలని కలెక్టరేట్‌ వద్ద ఒక రోజు నిరసన దీక్ష చేశారు. అప్పుడు గానీ ప్రభుత్వం దిగిరాలేదు. ఇప్పుడు 24 గంటల సమయాన్ని 48 గంటలకు పెంచింది. కొనుగోలు చేసే లక్ష్యం కూడా పెంచామంటున్నారు. దీని వల్ల 48 గంటల్లో ధాన్యం సొమ్ములు ఇస్తారనే నమ్మకం రైతులకు కలగడం లేదు. ఖరీఫ్‌లో సకాలంలో సొమ్ములు చెల్లించకుంటే రబీలో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందని రైతులు భయపడుతున్నారు.

ఖరీఫ్‌ వరిచేను

రైతుల ను వేధిస్తున్న కూటమి

గతంలో సకాలంలో ధాన్యం సొమ్ములు

జమచేయని వైనం

రోడ్డుపై ధర్నాలు చేసిన అన్నదాతలు

ఇప్పుడు ఖరీఫ్‌ ధాన్యం

కొనుగోలుకు సర్కారు సన్నాహాలు

48 గంటల్లో

డబ్బులు ఇస్తామని ప్రచారం

ఈసారి ఏమవుతుందోనని ఆందోళన

కె.గంగవరం మండలం కోటిపల్లిలో కళ్లాల్లోనే ఉన్న బొండాల రకం ధాన్యం (ఫైల్‌)

సొమ్ముసిల్లిపోయేలా..1
1/2

సొమ్ముసిల్లిపోయేలా..

సొమ్ముసిల్లిపోయేలా..2
2/2

సొమ్ముసిల్లిపోయేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement