రా‘బంధువుల’ మధ్య జీవించలేనంటూ.. | - | Sakshi
Sakshi News home page

రా‘బంధువుల’ మధ్య జీవించలేనంటూ..

Oct 16 2025 5:05 AM | Updated on Oct 16 2025 5:05 AM

రా‘బం

రా‘బంధువుల’ మధ్య జీవించలేనంటూ..

ఆలమూరు: బంధువులే రాబంధువులు అయ్యారు. అయిన వాళ్లే గద్దల్లా అనునిత్యం పొడుచుకుతిన్నారు. కేసులు పెట్టి హింసించి జైలుకు పంపించారు. సూటిపోటి మాటలతో వ్యక్తిత్వాన్ని కించపరచేవారు. దీంతో సమాజంలో తాను బతకలేనని అతడు భావించాడు. తాను చనిపోతే బిడ్డలు అనాథలైపోతారని భావించి, ముక్కుపచ్చలారని వారికి పురుగు మందు పట్టించి హత్య చేశాడు. తాను కూడా ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విచార సంఘటన ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో బుధవారం తెల్లవారుజామున జరిగింది.

వివరాలు ఇవీ..

స్థానిక శ్రీషిర్డీసాయి ఆలయం సమీపంలో నివసిస్తున్న పావులూరి కామరాజు అలియాస్‌ చంటి (36) గతంలో గ్రామ వలంటీర్‌గా పనిచేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేయడంతో, తన కులవృత్తి అయిన సెలూన్‌ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే ఐదేళ్ల క్రితం చంటి భార్య నాగదేవి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి చంటే కారణమంటూ అత్తింటి వైపు బంధువులు ఆగ్రహంతో ఉన్నారు. ఆ సమయంలో ఆలమూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతో చంటి జైలు శిక్షకు గురయ్యాడు. ఇటీవల భార్య నాగదేవి ఆత్మహత్య కేసుపై రాజీ కుదరడంతో బయటపడ్డాడు. కానీ బిడ్డలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

క్లూస్‌ టీం రాక

బిడ్డలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టేందుకు జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్‌, రావులపాలెం రూరల్‌ సీఐ సీహెచ్‌ విద్యాసాగర్‌, ఎస్సై జి.నరేష్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కాకినాడ నుంచి క్లూస్‌ టీంను రప్పించి వివరాలు సేకరించారు. మృతుడు చంటి సెల్ఫీ వీడియోలోని ఆరోపించిన విధంగా ఆ ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీటి వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కుటుంబ సభ్యుల రోదన

గ్రామస్తులకు చేదోడు వాదోడుగా ఉంటూ అందరిని ఆప్యాయంగా పలుకరించే తన కుమారుడు చంటి, బుడిబుడి అడుగులతో అల్లరితో సందడి చేసే ఇద్దరు మనవలు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. లోకం పోకడ తెలియని ఆ చిన్నారులను చంపి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డావంటూ వారు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ముక్కుపచ్చలారని ఆ పసి బాలుర మృతదేహాలను చూసిన స్థానికులు చలించిపోయారు.

ఇద్దరు పిల్లలను చంపి

తండ్రి ఆత్మహత్య

ముగ్గురి వేధింపులే కారణమని సెల్ఫీ

ఆలమూరు మండలం

మడికిలో విషాదం

కారణం ఆ ముగ్గురే..

తన సమీప బంధువులైన పావులూరి దుర్గారావు, కొరుప్రొలు తలుపులు, కొరుప్రొలు శ్రీనివాసరావు వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చంటి ఆరోపించాడు. చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియోను రూపొందించి తన కుటుంబ సభ్యులకు పంపించాడు. ఇటీవల ఆ ముగ్గురూ తనను చంపేందుకు పలు రకాలుగా ప్రయత్నించారన్నారు. తాను చనిపోతే తన కుమారులు అనాథలై పోతారని ఆందోళన చెందాడు. తన మాదిరిగా బిడ్డల ఆలన పాలన ఎవ్వరూ పట్టించుకోరని ఆవేదన చెందాడు. ఆ ఉద్దేశంతోనే పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వివరించాడు, ఆ ముగ్గురినీ కఠినంగా శిక్షించి తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.

రా‘బంధువుల’ మధ్య జీవించలేనంటూ..1
1/1

రా‘బంధువుల’ మధ్య జీవించలేనంటూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement