
3 నుంచి పారిశుధ్య కార్మికుల సమ్మె
అమలాపురం టౌన్: మున్సిపల్ శాఖలో సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు నవంబర్ 3 నుంచి అమలాపురం మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆ యూనియన్ అనుబంధ సంఘం ఏఐటీయూసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కె.సత్తిబాబు తెలిపారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వి.నిర్మల్ కుమార్‌కు బుధవారం ఉదయం సమ్మె నోటీసు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు నవంబర్ 3 నుంచి చేపట్టే సమ్మె సమాచారాన్ని నోటీసు ద్వారా తమ యూనియన్ తెలియజేసిందని కమిషనర్‌కు వివరించారు. సత్తిబాబు మాట్లాడుతూ విధి నిర్వహణలో కార్మికుడు మృతి చెందితే అతడి కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ విధానంలో ఉపాధి కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీని ప్రకటించాలని, 30 శాతం తాత్కాలిక భృతి చెల్లించాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. కమిషనర్‌కు సమ్మె నోటీసు అందించిన వారిలో కార్మిక నేతలు వాసంశెట్టి సత్తిరాజు, కొప్పుల బాబీ, పారిశుధ్య కార్మిక నాయకులు ఎం.సత్యనారాయణ, అమలదాసు గోవిందమ్మ, ఆర్.సుబ్బలక్ష్మి, కె.వెంకట్రావు ఉన్నారు.