
భీమేశ్వరస్వామికి రూ.26.37 లక్షల ఆదాయం
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామలోని మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయానికి హుండీల ద్వారా రూ.26,36,734 వచ్చినట్లు ఆలయ ఈఓ, దేవదాయశాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు. ఈ ఏడాది జూలై 5 నుంచి అక్టోబర్ 15 వరకు 102 రోజులకు హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించామన్నారు. హుండీల్లో రూ.24,72,056, అన్నదానం హుండీల్లో రూ.1,64,675, 2.200 గ్రాముల బంగారం, 99 గ్రాములు వెండి వచ్చిందన్నారు. దేవదాయశాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డివిజన్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ రాం ప్రసాద్, కె.గంగవరం గ్రూపు టెంపుల్స్ ఈఓ వి.బాలకృష్ణ, వెల్ల గ్రూపు టెంపుల్స్ ఈఓ వైవీవీ సత్యనారాయణ, ఆలయ అర్చకులు, వైదిక సిబ్బంది, స్థానిక పెద్దలు పెంకే సాంబశివరావు, ఆళ్ల బుజ్జి, దవులూరి రామకృష్ణ, అల్లం రామకృష్ణ నవీన్ పాల్గొన్నారు.
ఎన్‌ఎంఎంఎస్
దరఖాస్తులకు గడువు పెంపు
రాయవరం: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్‌ఎంఎంఎస్) 2025 పరీక్షకు దరఖాస్తుల గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా బుధవారం ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలు, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. గతంలో ఈ నెల 15 చివరి తేదీగా నిర్ణయించగా, ఈ గడువును ఈ నెల 25 వరకు పొడిగించారన్నారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 27, దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించడానికి ఈ నెల 29 చివరి తేదీలన్నారు.