● పట్టుబడుతున్న అధికారులు
● దొరికి పోతున్నా... లెక్కలేని తనం
సాక్షి, అమలాపురం: రాష్ట్రంలో కూటమి పాలన మొదలైన తరువాత ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి విచ్చలవిడిగా సాగుతోంది. ఒకవైపు ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా.. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు పట్టుబడుతున్నా మిగిలిన వారిలో జంకూగొంకూ లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా రెవెన్యూ శాఖలో అవినీతి అనేది పట్టపగ్గాలు లేకుండా సాగిపోతోంది. ప్రతి పనికీ ఒక రేటు అని నిర్ణయించారు. తాజాగా అమలాపురం తహసీల్దార్ పలివెల అశోక్ ప్రసాద్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పుప్పాల రాము ఏసీబీ వలలో చిక్కారు. కేవలం 15 సెంట్ల రైతు స్థలాన్ని సర్వే చేయడం కోసం ఏకంగా రూ.లక్ష లంచం డిమాండ్ చేయడం గమనార్హం. చివరకు రూ.50 వేలకు అంగీకరించి ఆ సొమ్ములు తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇదే కార్యాలయంలో రూ.5.88 లక్షల కూడా దొరకడం మరో సంచలనం. ఈ సొమ్ముల గురించి కథలు చెబుతున్నా తాహసీల్దార్ కార్యాలయంలో అంత సొమ్ము పట్టుబడడం స్థానికులను ఆశ్ఛర్యానికి గురి చేస్తోంది.
● ఇటీవలం రాజోలు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కె.రాంబాబు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గుబ్బల కృష్ణ తులసి భర్త బాలకృష్ణ స్థానిక ఫైర్‌స్టేషన్‌లో ఫైర్ ఆఫీసర్‌గా పని చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ తదితర ధ్రువీకరణ పత్రాలకు రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
● ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి వీఆర్వో పరసా శివన్నారాయణ సైతం ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. చల్లపల్లికి చెందిన మేకల సోమేశ్వర సత్య శ్రీరామ్ తన తల్లి రాజేశ్వరి పేరుమీద ఉన్న భూమి మ్యూటేషన్ చేయడానికి రూ.20 వేలు లంచంగా తీసుకుంటూ పట్టుబడ్డాడు.
● ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ ఒక రైతు నుంచి రూ.28 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. రైతు జి.సుబ్రహ్మణ్యానికి చెందిన 1.37 ఎకరాల భూమిని తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కె.విమల సరోజినీక ుమారి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని రైతు ప్రాధేయపడగా, రూ.28 వేలకు అంగీకరించి తీసుకుంటూ పట్టుబడ్డారు. రైతులు, వివాహితలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ పీడించి లంచాలు వసూలు చేయడం ప్రజలలో అధికారుల వ్యవస్థపై తీవ్ర వ్యతిరేకతను కలుగజేస్తోంది.