
అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి సన్నిధిలో మూడు రోజులు జరిగే పవిత్రోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారిలో విశేషమైన తేజస్సు కోసం నిర్వహించే ఈ పవిత్రోత్సవాలకు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. విష్వక్సేనారాధనతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. తెలిసీ, తెలియక చేసే తప్పులు, దోషాల నుంచి పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలను ఏటా నిర్వహిస్తున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.సత్యనారాయణరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నవ కలశ, పంచామృత సుగంధ ద్రవ్యాలతో ఉత్సవ మూర్తులకు అభిషేకం చేశారు. జలాలతో ముందుగా ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి, సంప్రోక్షణ జరిపారు. మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణ నడుమ ఉత్సవ మూర్తులను, పవిత్రాలను, పూజా ద్రవ్యాలను ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకు వచ్చి పవిత్రోత్సవాలను జరిపించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
నవంబర్ 17న
వాకర్స్ కన్వెన్షన్
అమలాపురం టౌన్: అమలాపురం శ్రీకళా గ్రాండ్‌లో నవంబర్ 17న నిర్వహించనున్న జిల్లా వాకర్స్ కన్వెన్షన్ కార్యక్రమానికి జిల్లా వాకర్స్ క్లబ్‌ల ప్రతినిధులతో పాటు అంతర్జాతీయ వాకర్స్ నుంచి పలువురి హాజరవుతున్నారని జిల్లా గవర్నర్ సప్పా నాగేశ్వరరావు తెలిపారు. అంతర్జాతీయ, జిల్లా వాకర్స్ ముఖ్య ప్రతినిధులు పాల్గొనే ఈ కన్వెన్షన్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించేందుకు స్థానిక శ్రీకళా గ్రాండ్‌లో గవర్నర్‌తో పాటు అంతర్జాతీయ వాకర్స్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ గోకరకొండ నాగేంద్ర, అంతర్జాతీయ మాజీ అధ్యక్షుడు డాక్టర్ పీఎస్ శర్మ తదితరులు చర్చించారు. వాకర్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు బుధవారం సమావేశమై కన్వెన్షన్ నిర్వహణపై మాట్లాడారు. ఈ కన్వెన్షన్‌కు జిల్లా నుంచి దాదాపు 100 మంది వాకర్స్ క్లబ్‌ల ప్రతినిధులు, అంతర్జాతీయ వాకర్స్ నుంచి సుమారు 30 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని అమలాపురం వాకర్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షుడు బోణం సత్య వరప్రసాద్ తెలిపారు.
బీచ్ ఫెస్టివల్‌ను
విజయవంతం చేయాలి
ఉప్పలగుప్తం: సంక్రాతిని పురస్కరించుకుని ఎస్.యానాం సముద్ర తీర ప్రాంతంలో జరిగే బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. కోనసీమ బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అధికారులతో కలసి బుధవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటక రంగ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు కోనసీమ ప్రాంతం ఎంతో అనువైనదన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.మాధవి, డ్వామా పీడీ మధుసూదన్, ఏపీడీ డి.రాంబాబు, పీఆర్ ఈఈ పి.రామకృష్ణారెడ్డి, డీఈఈ పి.రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పంచారామాలకు
ప్రత్యేక బస్సులు
తుని: కార్తికమాసం సందర్భంగా తుని డిపో నుంచి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు స్థానిక డిపో మేనేజర్ జీజీవీ రమణ తెలిపారు. బుధవారం ఆ మేరకు స్థానిక డిపోలో కరపత్రాలను విడుదల చేశారు. డిపో మేనేజర్ రమణ మాట్లాడుతూ ఈ నెల 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో (ఆదివారాలు) బస్సు తునిలో బయలుదేరి దర్శనానంతరం సోమవారం సాయంత్రం తిరిగి తుని చేరుతుందన్నారు. ఈ బస్సు టికెట్టు ధర రూ.1250 నిర్ణయించామన్నారు. వివరాలకు 73829 13216, 90633 66433, 73829 13016 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.

అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు