
బాణసంచా తయారీ కేంద్రాల్లో నిబంధనలు తప్పనిసరి
ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్
కొత్తపేట: బాణసంచా తయారీ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ సూచించారు. ఈ నెల 8న రాయవరం బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం సంభవించి ఎనిమిది మంది మృత్యువాత పడిన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడే బాణసంచా తయారీ కేంద్రాలను తనిఖీ చేస్తుంది. ప్రమాదాల నివారణలో భాగంగా ఐజీ అశోక్‌కుమార్ శుక్రవారం జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలసి జిల్లాలోని పలు బాణసంచా తయారీ కేంద్రాలను తనిఖీ చేశారు. బాణసంచా తయారీ విధానం, యంత్రాల వినియోగం, కార్మికుల భద్రత, అగ్ని ప్రమాదాల నివారణ, కార్మికులకు బీమా తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఐజీ మాట్లాడుతూ రాయవరం ప్రమాదం నేపథ్యంలో ఏలూరు రేంజ్ పరిధిలో జిల్లాల్లోని అన్ని బాణసంచా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాణ నష్టం లేకుండా వెంటనే స్పందించేందుకు తగు చర్యలు తీసుకునేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. తక్షణ వినియోగానికి ఇసుక బస్తాలు, నీరు తొట్టెలు, అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచాలన్నారు. బాణసంచా విక్రయాలు ప్రభుత్వం ఇచ్చిన తాత్కాలిక లైసెన్స్ ఆధారంగా సురక్షితమైన, బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే జరగాలన్నారు. ప్రమాదం సంభవించిన వెంటనే 112 నంబరుకు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దీపావళిని ప్రజలంతా సంతోషంగా, సురక్షితంగా జరుపుకోవడం పోలీసు శాఖ ప్రధాన ఆకాంక్ష అని అన్నారు. ఈ తనిఖీల్లో కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్, అమలాపురం టౌన్ సీఐలు సీహెచ్ విద్యాసాగర్, వీరబాబు, ఎస్‌బీ సీఐ పుల్లారావు, కొత్తపేట, రాయవరం ఎస్సైలు జి.సురేంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు.