
హోం మంత్రి, డీజీపీ రాజీనామా చేయాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి డిమాండ్
కొత్తపేట: రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసు శాఖ వైఫల్యం, దానిని న్యాయ స్థానం ధ్రువీకరించిన నేపథ్యంలో హోంమంత్రి, డీజీపీ తక్షణం రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. కొత్తపేటలో పార్టీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు స్వగృహంలో డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ పోస్టర్స్‌ను జగ్గిరెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎంపీ చింతా అనురాధ ఆవిష్కరించారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, కార్యకర్తలకు అండగా ఉండడానికి డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించినట్టు జగ్గిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కార్యకర్తలకు వచ్చిన ఇబ్బందులను పరిష్కరించేందుకు ఈ డిజిటల్ బుక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శాంతిభద్రతలు కాపాడవలసిన పోలీస్ శాఖ ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలం అయిందన్నారు. రాష్ట్రంలో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ను అరెస్ట్ చేసి కొంతమంది కూటమి నాయకుల తొత్తుల కింద పనిచేస్తున్న పోలీసు అధికారులు అబద్ధం ఆడటంతో పాటు కోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ను అరెస్టు చేసి, చేయలేదంటూ పోలీసులు చెప్పడంపై హైకోర్టు న్యాయమూర్తులు సీబీఐ ఎంకై ్వరీకి ఆదేశించారన్నారు. ఈ నేపథ్యంలో హోమ్ మినిస్టర్ తో పాటు, డీజీపీ కూడా రాజీనామా చేయాలని జగ్గిరెడ్డి కోరారు.
స్వార్థ పూరితంగా చంద్రబాబు పాలన
రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి పాలన స్వార్థపూరితంగా సాగుతోందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పేద, సామాన్య వర్గాలకు అందుబాటులో ఉండేలా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి, అనేక కాలేజీలు ప్రారంభిస్తే, నేటి సీఎం చంద్రబాబు వ్యక్తిగత స్వార్థప్రయోజనాల కోసం వాటి ప్రైవేటీకరణకు చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. శాసనసభ, శాసనమండలి గౌరవాన్ని దిగజార్చారని విమర్శించారు. మాజీ సీఎంను దుర్భాషలాడటాన్ని ఖండించారు. వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు, ఎంపీపీ మార్గన గంగాధరరావు, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరావు, మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, సీనియర్ నాయకులు కర్రి నాగిరెడ్డి, గొలుగూరి మునిరెడ్డి, మండల సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు నెల్లి లక్ష్మీపతిరావు, సర్పంచ్‌లు రెడ్డి చంటి, సాగి బంగార్రాజు, దూనబోయిన నవదీప, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు షేక్ వల్లీబాబా, ఎంపీటీసీ సభ్యురాలు పితాని లక్ష్మీతులసి పాల్గొన్నారు.