
కాజ్‌వేలపై వరద
– ఐదవసారి లంకవాసులకు ఇబ్బందులు
సాక్షి, అమలాపురం: గోదావరి లంక గ్రామాలను ఈ ఏడాది ఐదవసారి వరద ముంచెత్తుతోంది. భారీ వరదలు లేకున్నా వరుసగా వస్తున్న వరదలు స్థానికులు, లంక వాసులను ఇబ్బందులు పాల్జేస్తోంది. సెప్టెంబర్ నెలలో వరద మూడవసారి రావడం అత్యంత అరుదు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మరోసారి వరద పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి శనివారం మధ్యాహ్నం మొదలైన వరద ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు పెరుగుతూనే ఉంది. ఆరు గంటలకు 10.78 లక్షల క్యూసెక్కులు వరద నమోదు కాగా, ఏడు గంటల వరకు అదే నిలకడగా ఉంది. తరువాత నుంచి నెమ్మదిగా వరద తగ్గుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 10.71 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గింది. తరువాత నుంచి క్రమేపీ వరద తగ్గుముఖం పడుతోంది. రాత్రి తొమ్మిది గంటల సమయానికి 10.01 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గింది. అయితే మధ్యాహ్న సమయం నుంచి ఎగువన భద్రాచలం వద్ద వరద పెరుగుతుండడంతో దిగువన ముంపు వీడే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.
గోదావరి వరదకు జిల్లాలోని లంక గ్రామాల్లో ముంపు తీవ్రత పెరిగింది. కాజ్‌వేలు, లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు, పంట పొలాలు, తోటల్లో వరద నీరు చేరింది. పి.గన్నవరం మండలంలో కనకాయిలంక కాజ్‌వేపై వరద ముంపు మరింత పెరిగింది. ఈ మండలాన్ని ఆనుకుని ఉన్న అయోధ్యలంక, అనగారిలంక, శిర్రావారిలంక, పెదమల్లంక పడవల మీద రాకపోకలు సాగిస్తున్నారు. అప్పనపల్లి కాజ్‌వే నీట మునిగింది. పెదపట్నంలంక, అప్పనపల్లి, దొడ్డవరం ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ఎదురుబిడియం కాజ్‌వే నీట మునగడంతో ఇక్కడ పడవల మీద జనం రాకపోకలు సాగిస్తున్నారు. సఖినేటిపల్లి– నర్సాపురం రేవు మూసివేసి రాకపోకలు నిలిపివేశారు. ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠాన్నేలంక మత్స్యకార కాలనీ నీట మునిగింది. కూనాలంక, గురజాపులంక, చింతావానిరేవు, చింతపల్లిలంకల్లో వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఐ.పోలవరం మండలం అన్నంపల్లి అక్విడెక్టును తాకుతూ వరద ప్రవహిస్తోంది. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు రేవు వద్ద ఇళ్ల మధ్యకు వరద నీరు వచ్చి చేరింది. అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లిపాలెంలో మత్స్యకార ఇళ్ల చుట్టూ వరద నీరు చేరుతోంది.