
దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతులు
● ఏడాది కాలంలో
24 మంది రైతుల ఆత్మహత్యలు
● వైఎస్సార్ సీపీ రైతు విభాగం
రాష్ట్ర అధ్యక్షుడు రామారావు
అల్లవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోలేక రైతులు అత్యంత దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జున్నూరి రామారావు (బాబీ) అన్నారు. అల్లవరం మండలం డి.రావులపాలెంలోని ఆయన నివాసంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. గిట్టుబాటు ధర లేక పంటను రోడ్ల పక్కన పారవేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. కర్నూలు, కడప జిల్లాలో ఉల్లి కేవలం కిలో రూ.3, టమాటా రూ.1.50కు దక్కే పరిస్థితి ఉందన్నారు. ఈ రేటుతో రైతులకు కూలీ ఖర్చులు వస్తాయా.. అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బత్తాయి, అరటి, పొగాకు, వరి తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఉల్లికి మద్దతు ధర లేక అనంతపురం జిల్లాలో కౌలు రైతు కురవా రామచంద్రుడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇదే జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆయన కుటుంబం రోడ్డున పడిందని తెలిపారు. పల్నాడు జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 24 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని బీబీసీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ జిల్లా వ్యవసాయాధికారి చెప్పారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాళ్వా పంట ధాన్యం డబ్బు రైతులకు జమ అయ్యేంత వరకు పోరాటం చేసి రైతులకు అండగా నిలిచారని తెలిపారు. యూరియా కోసం రోడ్కెక్కిన రైతులకు బాసటగా వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తేనే గాని ఈ ప్రభుత్వం స్పందించలేదన్నారు. జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, అమలాపురం నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు కాండ్రేగుల జవహర్ తదితరులు పాల్గొన్నారు.