
పెన్షనర్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
అమలాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.సాయి వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం పట్టణం ఏవీఆర్ నగర్‌లోని జిల్లా పెన్షనర్ల అసోసియేషన్ భవనంలో జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పే కమిషన్ నియమించి, 30 శాతం ఇంటిరీయం రిలీఫ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 11వ పే రివిజన్ ఎరియర్లు చెల్లించకపోవడంతో రూ.లక్షల ఎరియర్లు అందకుండానే చాలా మంది పెన్షనర్లు కాలం చేస్తున్నారన్నారు. సీనియర్ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ తగ్గింపు దారుణమని అన్నారు. పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌వీఎస్‌ఎస్‌సీహెచ్ కృష్ణమూర్తి పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. జిల్లా కార్యదర్శి కేకేవీ నాయుడు సమావేశంలో కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. అనంతరం పాలెపు మాణిక్యాంబ జ్ఞాపకార్థం ఆమె సోదరులు పాలెపు సత్యనారాయణ, వెంకటరమణ సౌజన్యంతో 80 ఏళ్లు పైబడిన ఎనిమిది మంది సీనియన్ ఉపాధ్యాయ పెన్షనర్లను సత్కరించారు. ఇకపై ప్రతి ఏటా ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఈ ఎనిమిది మందిని సత్కరించడమే కాకుండా అందుకు శాశ్వత నిధి సమకూర్చుతామని పాలెపు సోదరులు ప్రకటించారు. ివిశ్రాంత ఉపాధ్యాయులు ఐవీ శ్రీనివాసరావు, కట్టా రామకృష్ణ, కె.సత్యనారాయణాచార్యులు, గుర్లింక సత్యనారాయణ, వై.పాండురంగారావు, జి.భీమరాజు, ఎస్.జగన్‌మోహనరావు, డీఎల్‌ఎన్ సోమయాజుల దంపతులను సత్కరించారు. సమావేశంలో పెన్షనర్ల అసోసియేషన్ ప్రతినిధులు మండలీక ఆదినారాయణ, కలిగినీడి ఉదయ భాస్కర్, శిష్టా శ్రీహరి, మెహబూబ్ సహీరా తదితరులు పాల్గొన్నారు.