
చదువుల సరస్వతి.. దుర్గాదేవి
హోమియోపతి వైద్య విద్యలో ట్రిపుల్ ధమాకా
రాయవరం: హోమియోపతి వైద్య విద్యలో రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన గుంటూరి దుర్గాదేవి ప్రతిభ కనబర్చింది. బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీహెచ్‌ఎంఎస్) పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలలో దుర్గాదేవి బీహెచ్‌ఎంఎస్ డిగ్రీ పూర్తి చేశారు. బీహెచ్‌ఎంఎస్ కోర్సు పూర్తి చేసిన సందర్భంగా మంగళవారం విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సమక్షంలో మూడు అవార్డులు కై వసం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఫస్టియర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకూ ప్రథమ స్థానంలో నిలిచినందుకు బెస్ట్ అవుట్ గోయింగ్ స్కూడెంట్ అవార్డుగా న్యాపతి వెంకట శ్రీనివాసరావు బంగారు పతకాన్ని పొందారు. ఫస్టియర్ నుంచి ఫైనలియర్ వరకూ అధిక మార్కులు సాధించినందుకు డాక్టర్ సూరపనేని చంద్రమౌళి ఎండోమెంట్ పురస్కారం అందుకున్నారు. అదేవిధంగా ఆంధ్రాయూనివర్సిటీ పరిధిలో ఫస్ట్ ఎటెంప్ట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మార్కులు సాధించినందుకు దివంగత డాక్టర్ ఎం.గురురాజు సిల్వర్ మెడల్‌ను సాధించారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..
నా తల్లి బాలనాగకోటేశ్వరి ఇచ్చిన ధైర్యం, పట్టుదలతో ముందడుగు వేశాను. తండ్రి కృష్ణ చిన్న హోటల్ వ్యాపారం చేస్తూ నన్ను కష్టపడి చదివించారు. వారిచ్చిన ప్రోత్సాహం, గురువులు చూపిన మార్గదర్శకత్వంతోనే ఈ విజయాలు సాధించాను. ప్రస్తుతం జయసూర్య పొట్టి శ్రీరాములు ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ (ఎండీ) కోర్సు చేస్తున్నాను. నా భర్త కొప్పినీటి మణిబాబు స్ఫూర్తితో పీజీ కోర్సును అభ్యసిస్తున్నాను.
–గుంటూరి దుర్గాదేవి, బీహెచ్‌ఎంఎస్
(ఎండీ హోమియో), సోమేశ్వరం