
డ్రైనేజీ వ్యవస్థ మెరుగుకు ప్రణాళిక
అమలాపురం రూరల్: చమురు సంస్థల సీఎస్‌ఆర్ నిధులతో తీర ప్రాంతంలో మత్స్య సంపద అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. బుధవారం రాజమహేంద్రవరం ఓఎన్జీసీ క్షేత్రస్థాయి ఇంజినీర్ కేవీకే రాజు, గ్రీన్ యూనిట్ ఎన్జీఓ దుర్గేష్ గుప్తాలు, స్థానిక అధికారులతో కలసి చెయ్యేరులో తాగునీటి చెరువు అభివృద్ధి పనులు, కూనవరం సముద్ర మొగ పూడికతో డ్రైన్ల మురుగునీరు సముద్రంలో కలవక తరచూ పంటలు ముంపు బారిన పడడం, సముద్ర తీర ప్రాంత రక్షణకు మడ అడవుల అభివృద్ధి, మత్స్య సంపద అభివృద్ధి, తీర ప్రాంతం వెంబడి పర్యావరణ హితంగా గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు వంటి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అమలాపురం కలెక్టరేట్‌లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ిసీఎస్‌ఆర్ నిధుల ద్వారా తీర ప్రాంత ప్రజలకు జీవనోపాధుల పెంపునకు కృషి చేస్తున్నామన్నారు. తీర ప్రాంత రక్షణలో భాగంగా కందికుప్ప, వాసాలతిప్ప ప్రాంతాల్లో మడ అడవుల అభివృద్ధికి చేపడుతున్న కార్యాచరణ పనులతో తదుపరి సమీక్షకు హాజరు కావాలని జిల్లా అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. కూనవరం మొగ నుంచి మురుగు పోయేలా ప్రతిపాదనలపై అధ్యయనం చేయాలన్నారు. డీఆర్వో కొత్త మాధవి, జిల్లా మత్స్యశాఖ అధికారి పీవీ శ్రీనివాసరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శంకర్రావు, గ్రీన్ క్‌లైమేట్ ఫండ్ అధికారి శ్రీహర్ష, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.