
ఏమైందో ఏమో!
● పెద్దేవంలో గేదెల మృత్యువాత
● 15 రోజుల్లో 25 మరణించిన వైనం
● ఆందోళనలో పాడి రైతులు
తాళ్లపూడి: పెద్దేవం గ్రామంలో పాడి పశువులు (గేదెలు) వరసగా మృత్యువాత పడుతున్నాయి. గత 15 రోజుల వ్యవధిలో సుమారు 25 వరకూ గేదెలు మరణించాయి. ఆకస్మాత్తుగా నీరసపడి, రెండు రోజులకే అవి మేత మేయక చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని సాయిబాబా, ఇతర ఆలయాల సమీపంలో సుగంది చెరువు ఉంది. దీని నీటిని పశువులు తాగుతాయి. అయితే చెరువు నీరు కలుషితం కావడం, ఆ నీటిని పశువులు తాగడం వల్లే చనిపోతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో తాగునీటికి ఉపయోగించిన ఈ చెరువు నేడు గుర్రపు డెక్క పేరుకుపోయి అధ్వానంగా మారింది. దానిలో మలమూత్ర విసర్జనలు, మృత కళేబరాలను వేస్తున్నారు. కాగా.. తమ గ్రామంలో పశువులు ఎందుకు చనిపోతున్నాయో తెలియడం లేదని రైతులు జమ్ముల శ్రీను, బెల్లంకొండ సోమన్న, యాండపల్లి లక్ష్మణరావు, నామన సుబ్బారావు తదితరులు ఆందోళన చెందుతున్నారు.
నమూనాల సేకరణ
పశుసంవర్ధకశాఖ మండల అధికారి బాలాజీ బుధవారం పెద్దేవంలో పర్యటించి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పశువులకు వచ్చిన రోగ లక్షణాలు కొత్తగా ఉన్నాయని, కిడ్నీ, లివర్ దెబ్బతింటున్నాయన్నారు. తీసుకునే ఆహారం కానీ, తాగే నీరు కానీ కలుషితమై ఉండచ్చన్నారు. గడ్డి, నీరు, రక్త నమూనాలను పరీక్షలకు పంపామని, ఫలితాలు వచ్చాక విషయం తెలుస్తుందన్నారు.

ఏమైందో ఏమో!