
ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
● జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు
● కాకినాడలో స్థాయీ సంఘ సమావేశాలు
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): క్షేత్రస్థాయిలో ప్రజా అవసరాలపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సారించాలని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయీసంఘ సమావేశాలు చైర్మన్ వేణుగోపాలరావు, ఆయా సంఘాల చైర్మన్ల అధ్యక్షతన జరిగాయి. వీటికి శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, కుడుపూడి సూర్యనారాయణరావు హాజరయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని ఆయా అంశాల స్థాయి సంఘాలు సమీక్షించాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులకు సూచనలు చేశాయి. తొలుత రామచంద్రపురం మండలం జెడ్పీటీసీ సభ్యులు ఎం.వెంకటేశ్వరరావు ఆగస్టులో మృతి చెందిన నేపథ్యంలో సభలో మౌనం పాటించారు.
● అక్షరాంధ్ర కార్యక్రమానికి సంబంధించి జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, జిల్లా వయోజన విద్యాశాఖ డీడీ పోశయ్యలతో కలిసి గౌరవ సభ్యులందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అక్షరాంధ్ర వయోజన విద్య పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రస్తుత ఖరీఫ్, రానున్న రబీ సీజన్లకు కాలువల ద్వారా నీరు సక్రమంగా పంట పొలాలకు అందేలా చూడడంతో పాటు అకాల వర్షాల వల్ల పొలాలు ముంపునకు గురి కాకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని గౌరవ సభ్యులు అధికారులను కోరారు.
● వైద్య,ఆరోగ్యశాఖకు సంబంధించి సీజనల్ వ్యాధుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన వైద్య అధికారులు పారా మెడికల్ సిబ్బందిని నియమించాలని కోరారు.
● రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు అధికారులకు సూచించారు. మోతాదుకు మించి యూరియా వినియోగించడం వల్ల అనేక రోగాల బారిన ప్రజలు పడుతున్నారని, ఈ అంశంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు.
● అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉండేలా శాసన మండలి సభ్యులు కుడుపూడి సూర్యనారాయణరావు కోరారు.