
నీలపల్లి హత్య కేసులో నిందితుడికి రిమాండ్
తాళ్లరేవు: నీలపల్లిలో జరిగిన హత్య కేసుకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. నీలపల్లి పంచాయతీ మురళీనగర్‌లోని సిమెంట్ దుకాణం ఎదురుగా ఆగస్టు 25వ తేదీ అర్ధరాత్రి సమయంలో హత్య జరిగింది. సెల్‌ఫోన్ విషయంలో వివాదం చెలరేగి, యానాం కాకివారి వీధికి చెందిన పాలెపు శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు. అతడు స్నేహితుడైన యానాం కురసాంపేట గ్రామానికి చెందిన అంగాని రాజు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ మేరకు నిందితుడిని కాకినాడ రూరల్ సీఐ డి.చైతన్య కృష్ణ, కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ స్టేషన్ రైటర్ ఎన్వీ రమణ అరెస్ట్ చేశారు. కాగా.. అంగాని రాజుకు సుమారు 20 ఏళ్ల క్రితం పశువుల్లంక గ్రామానికి చెందిన మరియమ్మతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజుతో తగాదాపడి ఆమె ఇంటిలోనే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కాట్రేనికోన పోలీస్‌స్టేషన్‌లో రాజుపై కేసు నమోదైంది. అనంతరం మరో వివాహం చేసుకున్నాడు. 2021లో కొట్లాట కేసు, 2022లో బండి దగ్థానికి సంబంధించి అతడిపై కేసులు ఉన్నాయి.