
ఉత్తుత్తి విద్యుత్
సాక్షి, అమలాపురం: ఏదైనా ప్రజా ప్రయోజన కార్యక్రమం అమలు చేయాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. అవేమీ లేకుండా కేవలం ప్రచార యావతో చేస్తే క్షేత్ర స్థాయిలో ఫలితాలు వేరే విధంగా ఉంటాయనడానికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. అభివృద్ధి పేరుతో చేస్తున్న పనులు.. ప్రజాహిత కార్యక్రమాలే ఒక ఉదాహరణ. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పింది. తీరా అమలు చేసే సమయానికి ఆంక్షలు వర్తిస్తాయని షరతులు పెట్టింది.
జిల్లాలో వినాయక మండపాల ఏర్పాటుకు అను మతి కోరుతూ పోలీస్ శాఖకు ఆన్‌లైన్‌లో సుమారు 1,511 దరఖాస్తులు వచ్చాయి. అనుమతి లేకుండా రెండు, మూడు రెట్ల వినాయక మండపాలు ఏర్పాటు చేశారని అంచనా. ఆయా మండపాలను నిర్వాహకులు విద్యుత్ దీపాల అలంకరణలతో ముస్తాబు చేశారు. చాలా మండపాలకు స్థానికంగా ఉన్న గృహ సముదాయాలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాల నుంచి విద్యుత్ తీసుకుంటున్నారు. గుళ్లు, గోపురాల వద్ద వాటికి ఉన్న సర్వీసుల నుంచి విద్యుత్ వాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రకటించింది. తీరా దీనిని అమలు చేసే సమయానికి ఆంక్షలు పెట్టింది.
ఇంకా ఎవరికీ తెలియక..
వినాయక చవితి ఈ నెల 27న మొదలైతే అంతకు ముందు రోజు రాత్రి మాత్రమే మండపాలకు ఉచిత ఉత్తర్వులు ఇచ్చింది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఉత్తర్వులు వచ్చిన విషయం మండపాల నిర్వాహకులకు ఇప్పటికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. తెలిసిన వారు నిబంధనలకు భయపడి ముందుకు రావడం లేదు. ప్రధానంగా గ్రామీణ ప్రాంత వాసులకు దీనిపై పెద్దగా అవగాహన లేదు. ఈ కారణంగా ఇప్పటి వరకూ జిల్లాలో కేవలం 42 మండపాలకు మాత్రమే ఉచిత విద్యుత్ కల్పించారు. అమలాపురం పట్టణంలో సుమారు 75 వరకూ మండపాలు ఉండగా, శనివారానికి 12 పందిళ్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం తీసుకున్నారు. ఇక మండపేట నియోజకవర్గం పరిధిలో 186 వరకూ మండపాలు ఉండగా, కేవలం 14 మాత్రమే ఉచిత సర్వీసుకు దరఖాస్తు చేసుకున్నారు. రామచంద్రపురం మున్సిపాలిటీ, ముమ్మిడివరం నగర పంచాయతీతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది.
కొంతమంది మాత్రమే..
వినాయక చవితి ముందు రోజు రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. ఏఈలు, లైన్‌మెన్ల ద్వారా జిల్లాలో అన్ని గణపతి మండపాల కమిటీలకు ఉచిత విద్యుత్ కోసం వివరించాం. అప్పటికే ఆలయాల నుంచి మండపాలకు విద్యుత్ తీసుకున్నారు. కొంత మంది మాత్రమే దరఖాస్తులు చేసుకుని వినియోగించుకున్నారు. దసరా వేడుకలకు ఎక్కువ మంది ఈ పథకాన్ని ఉపయోగించుకుంటారు.
– బి.రాజేశ్వరి, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ
జిల్లాలో మూడు వేలకు పైగా
వినాయక మండపాలు
ఉచిత విద్యుత్ ఇస్తామన్న కూటమి ప్రభుత్వం
ఇప్పటి వరకూ 42 చోట్ల మాత్రమే వినియోగం
నిబంధనలకు భయపడుతున్న నిర్వాహకులు

ఉత్తుత్తి విద్యుత్