వంచన పెంఛెన్‌! | - | Sakshi
Sakshi News home page

వంచన పెంఛెన్‌!

Aug 30 2025 7:56 AM | Updated on Aug 30 2025 7:56 AM

వంచన

వంచన పెంఛెన్‌!

ఎల్లుండి నుంచి నిలిచిపోనున్న

2,899 దివ్యాంగ పింఛన్లు

అనర్హత పేరుతో

802 స్పౌజ్‌ పింఛన్ల కోత

కొత్త పింఛన్ల మాటెత్తని ప్రభుత్వం

25 వేల మంది ఎదురుచూపు

ఆలమూరు: ఆచరణ సాధ్యం కాని హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పెన్షన్లను అంతకంతకూ తొలగిస్తూ వంచనను సైతం అదే స్థాయిలో పెంచుకుంటూ పోతోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టి 15 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ ఒక కొత్త పింఛన్‌ను మంజూరు చేయలేదు. స్పౌజు పింఛన్లను కూడా ఏడాది తరువాత కాని లబ్ధిదారులకు అందించలేదు. కొత్త సామాజిక పింఛన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం కరుణించడం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం అర్హుల నుంచి పింఛన్‌ దరఖాస్తును కూడా స్వీకరించడం లేదు. జిల్లా వ్యాపంగా ఏళ్ల తరబడి తీసుకుంటున్న దివ్యాంగ పింఛన్లను ఏకపక్షంగా తొలగించారు. భర్త మృతి చెందితే భార్య (స్పౌజు)కు మంజూరు చేసే పింఛన్‌ కోసం లబ్ధిదారులను నెలల తరబడి తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నారు. సూపర్‌ సిక్స్‌లో ప్రధానమైన హామీల్లో ఒకటైన 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్‌ ఇస్తామన్న మాటనే ప్రభుత్వం మరచిపోయింది. ప్రతి నెలా పింఛన్ల పంపిణీ సమయంలో ఇంటింటికీ వస్తున్న కూటమి నేతలను కొత్త పింఛన్లపై లబ్ధిదారులు ప్రశ్నిస్తుంటే నోరెళ్లబెట్టే పరిస్థితి అంతటా నెలకొంది.

వేలాది మంది ఎదురుచూపు

జిల్లాలో ప్రస్తుతం 2.37 లక్షల మంది పెన్షన్‌ లబ్ధిదారులు ఉండగా సగటున ప్రతి నెలా రూ.101.44 కోట్లు పంపిణీ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 515 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా సుమారు 25 వేల మంది అర్హులైన వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర లబ్ధిదారులు సామాజిక పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త పింఛన్‌ కోసం దరఖాస్తు ఎప్పుడు తీసుకుంటారంటూ వారు గ్రామ సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక్కొక్క సచివాలయంలో 30 నుంచి 70 మంది లబ్ధిదారులు పింఛన్‌కు అర్హత ఉన్నట్లు తెలుస్తోంది. అర్హుల నుంచి కనీసం దరఖాస్తును స్వీకరించలేని దుస్థితిని ప్రభుత్వం కల్పించింది. జిల్లాలో గత జూలై నెలాఖరు వరకూ మంజూరు చేసే పింఛన్ల కోసం 3,625 మంది ధరఖాస్తు చేసుకున్నారు. అందులో 802 మందిని అనర్హులంటూ పింఛన్‌ నిలిపివేసి కేవలం 2823 మందికి మాత్రమే స్పౌజు పింఛన్‌ అందజేస్తున్నారు. అలాగే ఏళ్ల తరబడి దివ్యాంగ పింఛన్లను తీసుకుంటున్న 32,594 మందిలో 3,220 మంది దివ్యాంగ పింఛన్లను తొలగించారు. అలాగే 131 మంది శాశ్వత అంగవైకల్యం ఉన్న వారికి లేదా మంచం పట్టిన రోగులకు ఇచ్చే రూ.15 వేల పింఛన్‌ను సాధారణ దివ్యాంగుల జాబితాలో చేర్చి కేవలం రూ.ఆరు వేలకు పరిమితం చేశారు. అందులో మళ్లీ 190 మందిని వృద్ధాప్య పింఛన్లలో జత చేశారు. వేలాది పింఛన్లను ఏకపక్షంగా తొలగిస్తున్నా ఇప్పటి వరకూ ఒక కొత్త పింఛన్‌కు కూడా అర్హులకు అందించకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

పేదలకు అండగా

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం

రాష్ట్రంలో సంక్షేమ పథకాల్లో నూతన ఒరవడి సృష్టించిన నాటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలోను పేదలకు అండగా నిలిచింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎళ్లవేళలా పింఛన్ల మంజూరు కోసం ఉద్యోగులు, సిబ్బంది దరఖాస్తులు స్వీకరించి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసేవారు. అందులో అర్హులను పారదర్శకంగా గుర్తించి కులం, మతం, రాజకీయాలు, పార్టీలకు అతీతంగా పేదరికమే ప్రామాణికంగా యేటా జనవరి, జూలై నెలల్లో క్రమం తప్పకుండా అర్హులందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేసి అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రత్యేకత చాటుకుంది. అలాగే ఒకటో తేదీ తెల్లవారుజామునే ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా గ్రామ వలంటీర్లతో నేరుగా లబ్ధిదారులకు అందజేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపే చర్యలు తీసుకుని దేశానికి సంక్షేమ పథకాల అమలులో అదర్శంగా నిలిచింది.

2019 వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చేనాటికి జిల్లాలో సామాజిక పింఛన్లు దాదాపు 1.54 లక్షలు వరకు ఉండగా ఐదేళ్లలో వాటి సంఖ్య 2.37 లక్షలకు పెంచి పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేసింది. 2024 జనవరిలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో ఎన్నికలకు ముందు గత ఏడాది జనవరిలో కొత్తగా మంజూరు చేసిన పింఛన్లు తప్ప ఇప్పటి వరకూ మరొక కొత్త పింఛన్‌ మంజూరు చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం.

వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే

ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక పింఛన్ల తొలగింపు, 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అందించకపోవడంపై ప్రజలంతా ఆగ్రహావేశాలతో ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా ఆలమూరు మండలంలో 212, అత్యల్పంగా అమలాపురంలో రూరల్‌ మండలంలో 36 పింఛన్లను ప్రభుత్వం నిలిపివేసింది. దురుద్దేశంతో నిలిచివేసిన పింఛన్‌ పునరుద్ధరణ కోసం మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పడం కంటితుడుపు చర్య మాత్రమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నా పింఛన్‌ తొలగించారు

గతంలో జరిగిన ప్రమాదంలో ఒక కంటి చూపు కోల్పోయాను. దీనిపై పలు కంటి అస్పత్రుల్లో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది. సదరం సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకోగా వైద్యులు 60 శాతం మేర వైకల్యం ఉందని ధ్రువపత్రం జారీ చేశారు. గత ఆరేళ్లుగా దివ్యాంగ పింఛన్‌ను తీసుకుంటున్న తనకు రీ వెరిఫికేషన్‌ పేరిట నా పింఛన్‌ తొలగించారు.

– తోలేటి సత్తిబాబు, దివ్యాంగుడు,

సంధిపూడి, ఆలమూరు మండలం

అర్హత ఉన్నా తీసేశారు

వెన్నెముక తీవ్రంగా దెబ్బతినడంతో 20 నేళ్లుగా మంచానికే పరిమితమయ్యాను. సదరం శిబిరంలో 90 శాతం మేర అంగవైకల్యం ఉందని వైద్యులు నిర్థారించారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.15 వేలు పింఛన్‌ అందాల్సి ఉండగా సాధారణ దివ్యాంగ పింఛన్‌ మాదిరిగా రూ.ఆరు వేలు అందిస్తున్నారు. దీనిపై అధికారుల వద్ద పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది.

– బొబ్బా వెంకటరమణ (చిన్ని), ఆలమూరు

వంచన పెంఛెన్‌!1
1/2

వంచన పెంఛెన్‌!

వంచన పెంఛెన్‌!2
2/2

వంచన పెంఛెన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement