
దయనీయ బాల్యంపై వాత్సల్యం
● మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్
పథకంతో ఆర్థిక సాయం
● బాలల భవిత, భద్రత, ఆరోగ్యం కోసం
● అనాథలు, దీన బాలలు అర్హులు
● కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ
● దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం
● అవగాహన లోపంతో
దరఖాస్తు చేసుకోని వైనం
కాకినాడ క్రైం: దయనీయ బాల్యంపై వాత్సల్యం కురిసింది. మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ పథకం దయనీయ స్థితిలో ఉన్న నిస్సహాయ బాలలకు చేయూతనిస్తోంది. వారిని బాధ్యతగా చూసుకుంటున్నవారికి తన వంతు సాయమందిస్తోంది. జిల్లాలో ప్రతి ఏటా వందలాది మంది బాలలు ఈ ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉన్నా, అవగాహన లేక పథక ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు.
ఏంటీ పథకం...
మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ పథకం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో అనుబంధ జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అర్హులైన బాలలకు ఈ పథక ప్రయోజనాలను అందిస్తోంది. బాలల భవిత, భద్రత, ఆరోగ్యంతో పాటు కుటుంబ అనుబంధాలన్నీ ఆఽస్వాదించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. తమ వారికి దూరం చేయకుండా అక్కడే ఉంచి సాయం అందిస్తున్నారు. బాలల పోషణ చూస్తున్న సహాయకులు, సంరక్షకులకు సాయమందిస్తూ బాలల ఉన్నతికి తోడ్పాటునివ్వడమే ఈ పథక ఉద్దేశం.
కలెక్టర్ చైర్‌పర్సన్‌గా కమిటీ
అర్హులైన బాలల్ని ఎంపిక చేసేందుకు ప్రత్యేక కమిటీ ఉంది. ఈ కమిటీని స్పాన్సర్‌షిప్ అండ్ ఫోస్టర్ కేర్ అప్రూవల్ కమిటీ (ఎస్‌ఎఫ్‌సీఏ) అంటారు. కలెక్టర్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ, మెంబర్లుగా సీడబ్ల్యూసీ(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) మెంబర్ లేదా చైర్‌పర్సన్, బాలల సంరక్షణ కోసం పనిచేసే ఎన్‌జీవో ప్రతినిధి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి(డీసీపీవో), జిల్లా బాలల పరిరక్షణాధికారి(పీవో ఎన్‌ఐసీ), శిశుగృహ మేనేజర్ మెంబర్లుగా ఉంటారు. అర్హులైన బాలల్ని ఎంపిక చేయడంలో వీరిదే తుది నిర్ణయం.
అర్హులెవరు
తొలి ప్రాధాన్యత తల్లి, తండ్రిని కోల్పోయిన పూర్తి స్థాయి అనాథలకు ఇస్తారు. కోవిడ్ వేళ తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయిన పిల్లలు, హెచ్‌ఐవీ బారిన పడిన బాలలు, తల్లిదండ్రులకు హెచ్‌ఐవీ సహా ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్న పిల్లలు, పోక్సో బాధిత బాలలు, పాక్షిక అనాథలు, రక్షణ, సంరక్షణ అవసరం ఉన్న పిల్లలు స్పాన్సర్ షిప్ పథక ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులు. కేవలం మైనర్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
ప్రతి నెలా రూ.4 వేలు
స్పాన్సర్ షిప్ పథకం ద్వారా అర్హులైన పిల్లలకు ప్రతి నెల రూ.4 వేల చొప్పున పిల్లల ఖాతాలు లేదా వారి సంరక్షకులతో ఉమ్మడిగా ఉన్న జాయింట్ ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం డబ్బు జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని వారి సంరక్షకులు... పిల్లల చదువు, ఆరోగ్యం అవసరాలకు, పిల్లల రోజు వారీ అవసరాల నిర్వహణకు తప్ప మరే రకంగానూ వెచ్చించకూడదు. అంగన్‌వాడీ వర్కర్లు, గ్రామ మహిళా పోలీసుల ద్వారా ఇటువంటి పిల్లల్ని గుర్తిస్తారు. బాలల వాస్తవ స్థితిని స్వయంగా ఇంటికి వెళ్లి నిర్దారిస్తారు. సంరక్షకులు లేదా తల్లి లేదా తండ్రి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులను అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు సీడీపీవోలకు అందిస్తారు. వీటిని నిర్ధారించి సీడీపీవోలు డీసీపీయూ విభాగానికి పంపిస్తారు. ఈ యావత్ ప్రక్రియ ఐసీడీఎస్ పీడీ ఆధ్వర్యంలో జరుగుతుంది. దరఖాస్తు చేసుకోవడం అంతా ఆఫ్‌లైన్ విధానంలోనే.
కావలసిన ధ్రువీకరణలు
బాలుడు లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, గ్రామాల్లో నివసిస్తే ఆదాయం ఏడాదికి రూ.72 వేలకు మించకూడదు. అర్బన్ అయితే రూ.96 వేల లోపు వార్షిక ఆదాయం ఉండాలి. బాలుడు లేదా బాలిక ఆధార్ కార్డు, తల్లిదండ్రులు ఇద్దరూ లేదా వారిలో ఒక్కరు మరణించినట్లయితే సంబంధిత మరణ ధ్రువీకరణ పత్రాలు, బాలలు లేదా తల్లిదండ్రులకు దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఆ రిపోర్టులు, పోక్సో బాధితులు అయితే కేసు పత్రాలు, బాలుడు లేదా సంరక్షకులతో కూడిన జాయింట్ అకౌంట్ వివరాలు, సంరక్షకులు మాత్రమే ఉంటే వారి ఆధార్ కార్డు, వారి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.కాకినాడ జిల్లాలో గడచిన మూడేళ్లలో మొత్తం 1,626 మంది బాలలకు మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ పథకం ద్వారా ప్రయోజనం అందింది. 2022–23 ఏడాదిలో 683 మంది, 2023–24లో 440 మంది, 2024–25 లో 503 మంది దీన బాలలకు నెలకు రూ.4 వేలు చొప్పున సహకారం అందింది.
18 ఏళ్లు నిండే వరకు
స్పాన్సర్ షిప్ పథకం జిల్లాలో డీసీపీ యూనిట్ పరిధిలో డీసీపీవో వెంకట్ పర్యవేక్షణలో పీవో ఎన్‌ఐసీ కె.విజయ ఆధ్వర్యంలో అమలవుతోంది. బాలలు ఏ వయసులో దరఖాస్తు చేసుకున్నా వారికి 18 ఏళ్లు నిండే వరకు స్పాన్సర్ షిప్ ప్రయోజనం అందుతుంది. బాలలు కచ్చితంగా చదువుతుండాలి. హాస్టళ్లలో ఉంటే వర్తించదు. సింగిల్ పేరెంట్, అనాథ బాలలు, వ్యాధిగ్రస్త బాలలు, వ్యాధి ప్రభావిత పిల్లల్ని ఎవరినైనా చేరదీస్తే వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తను సంప్రదించాలి. కుటుంబ జీవితానికి పిల్లల్ని దూరం చేయకుండా వారి భవితకు భరోసా కల్పించడమే ఈ పథకం లక్ష్యం.
– చెరుకూరి లక్ష్మి, పీడీ, ఐసీడీఎస్

దయనీయ బాల్యంపై వాత్సల్యం