
పెరిగి తగ్గుతున్న వరద గోదారి
ఐ.పోలవరం: గోదావరికి మరోసారి వరద వచ్చింది. ఉదయం పెరిగిన వరద.. సాయంత్రం నుంచి తగ్గుముఖం పడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలమైంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి ఉప నదులు ప్రాణహిత, ఇతర నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఆ ప్రభావం జిల్లాపై పడింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉదయం నుంచి వరద పోటు మొదలైంది. ఉదయం ఆరు గంటల సమయానికి బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 6,59,443 క్యూసెక్కులు నమోదు కాగా, తూర్పు డెల్టాకు 1,600, మధ్య డెల్టాకు 700, పశ్చిమ డెల్టాకు 2 వేల క్యూసెక్కుల చొప్పున 4,300 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యారేజీ నుంచి దిగువకు 6,55,143 క్యూసెక్కుల వృథా జలాలను విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు 7,88,938 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వరద జలాల రాక తగ్గు ముఖం పట్టింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 7,66,843 క్యూసెక్కులు, సాయంత్రం ఆరు గంటల సమయానికి 7,52,579 క్యూసెక్కులకు తగ్గింది. తెలంగాణాలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి 9.71 లక్షల క్యూసెక్కుల వరద నీటిని వదిలారు. దీనికి దిగువన కూడా ఉప నదుల నుంచి, కొండ యేరుల నుంచి వరద జలాలు వస్తుండడంతో జిల్లా మరోసారి వరద బారిన పడే ప్రమాదముందని సాగునీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఐ.పోలవరంలో 14.8 మిల్లీ మీటర్ల వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం ఉదయం 8 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 2.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా ఐ.పోలవరం మండలంలో 14.8 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా మామిడికుదురు మండలంలో 0.8 మిల్లీ మీటర్ల వర్షం పడింది. ఆత్రేయపురంలో 13.2, మండపేటలో 2, రాయవరంలో 2.6, రావులపాలెంలో 3.2, కొత్తపేట 1.2, కపిలేశ్వరపురం 1.4, ముమ్మిడివరంలో 3.2, అంబాజీపేటలో 4.2, రాజోలులో 1.8, అల్లవరంలో 4.2, అమలాపురంలో 8.2, ఉప్పలగుప్తంలో 1.2 మి.మీటర్ల చొప్పున వర్షం కురిసింది.